టీడీపీకి ఝ‌ల‌క్‌.. ప‌వ‌న్ పార్టీలోకి మేయ‌ర్!

2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయంగా స‌మీక‌ర‌ణ‌ల మార్పు ఊపందుకుంటోంది. అంద‌రినీ తానే త‌న పార్టీలోకి ఆహ్వానించాల‌ని, మిగిలిన ప‌క్షాలేవీ రాష్ట్రంలో ఉండ‌కూడ‌ద‌ని పెద్ద ఎత్తున లెక్చ‌ర్లు దంచికొడుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఆయ‌న సొంత పార్టీలోనే ఫిరాయింపులు ఊపందుకునే అవ‌కాశం ఉంద‌ని తెలియ‌డం లేద‌ని అంటున్నారు రాజ‌మండ్రి త‌మ్ముళ్లు! రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మండ్రిలో టీడీపీకి పెద్ద దెబ్బే త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక్క‌డ కార్పొరేష‌న్ టీడీపీ కైవసం చేసుకుంది. మేయ‌ర్ అభ్య‌ర్థిగా పంతం రజని శేష సాయి ఉన్నారు. ఇప్పుడు ఈమె కుటుంబం స‌హా జ‌న‌సేన‌లోకి జంప్ చేసే స‌మ‌యం వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది.

అస‌లేం జ‌రిగిందో చూద్దాం. పంతం రజని శేష సాయి భ‌ర్త పంతం కొండ‌ల రావు. రాజ‌కీయంగా గ‌త 30 ఏళ్లుగా చ‌క్రం తిప్పుతున్నాడు. కాంగ్రెస్‌లో కీల‌కంగా ఉన్న ఈయ‌న ఒక సారి కార్పొరేటర్ గా పనిచేశారు. కాపు సామాజిక వర్గం, వ్యక్తిగత ఇమేజ్ పని చేయడంతో విభజన తరువాత టీడీపీ ఆయన భార్యకు మేయర్ ఆఫర్ ఇవ్వ‌డంతో పంతం కుటుంబం మొత్తం మూకుమ్మ‌డిగా సైకిలెక్కేసింది. అయితే ఆమె పేరుకే మేయర్ తప్ప చక్రం తిప్పేది అటు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి , కమిషనర్ విజయరామరాజులే . వీరు కాక మరో సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావు. ఇప్పుడు ఈ ప‌రిణామ‌మే కొండ‌ల‌రావుకు కోపం తెప్పించింది.

ప‌రిస్థితి ఇలానే ఉంటే.. 2019లో త‌మ‌కు అడ్ర‌స్ గ‌ల్లంతు అవుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. మంది ఎక్కువైతే.. మ‌జ్జిగ ప‌ల్చ‌న అన్న చందంగా టీడీపీ మారిపోతుంద‌ని భావించిన ఆయ‌న దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకునేందుకు రెడీ అంటున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌లోకి వెళ్లి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్ పొందాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇన్నాళ్లుగా లేనిది.. ఆయ‌న కార్పొరేష‌న్‌లో అవినీతి పెరిగిపోయింద‌ని విప‌రీమైన కామెంట్లు చేస్తున్నారు.

కమిషనర్ వైఖరి పై టౌన్ ప్లానింగ్ అవినీతిపై దశలవారీ పోరాటం చేపడతా అంటూ విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఈ ప‌రిణామం కేవ‌లం పార్టీ మారే వ్యూహంలో భాగ‌మేన‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. పంతం ఫ్యామిలీకి స్థానికంగా మంచి కేడ‌ర్ ఉంది. దీంతో ఈయ‌న జంప్ చేస్తే.. పార్టీ దెబ్బ ఖాయ‌మ‌నే వ్యాఖ్య కూడా వినిపిస్తోంది.