ఎంపీ బ‌రిలో ష‌ర్మిల‌… మూడు ఆప్ష‌న్లు రెడీ..!

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిలకు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌న్న కోరిక ఎట్ట‌కేల‌కు వచ్చే ఎన్నిక‌ల్లో తీర‌నుంది. వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని ఎంతో ఉవ్విళ్లూరిన ఆమె ఆశ‌ల‌ను జ‌గ‌న్ వ‌మ్ము చేశారు. స‌మీక‌ర‌ణ‌లు, ఇత‌ర‌త్రా అంశాల నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల్లో ష‌ర్మిల‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్ట‌క త‌ప్ప‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ క‌జిన్ అవినాష్‌రెడ్డికి క‌డ‌ప ఎంపీ సీటు ఇచ్చిన జ‌గ‌న్‌, త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మిని విశాఖ నుంచి బ‌రిలోకి దింపారు. చివ‌రి క్ష‌ణంలో ష‌ర్మిల ఖ‌మ్మం ఎంపీ సీటు ఆశించారు.

అయితే ఫ్యామిలీలో అప్పటికే రెండు ఎంపీ సీట్లు ఇవ్వ‌డం, మ‌రో వైపు తాను పులివెందుల నుంచి, మేన‌మామ క‌మ‌లాపురం నుంచి ఎమ్మెల్యేలుగా బ‌రిలో ఉండ‌డంతో జ‌గ‌న్ ష‌ర్మిల‌ను ప‌క్క‌న పెట్టారు. తర్వాత ఆమె రాజ్య‌స‌భ సీటు ఆశించినా అది విజ‌యసాయిరెడ్డికి ఇచ్చారు. ఇక క‌నీసం ఎమ్మెల్సీ అయినా ద‌క్కుతుంద‌ని ఆమె ఆశించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ష‌ర్మిలకు, ఆమె భ‌ర్త అనిల్‌కు జ‌గ‌న్‌కు మ‌ధ్య పొరాపొచ్చ‌ల‌పై కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

వాస్త‌వానికి జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు ష‌ర్మిల అప్ప‌టి సమైక్యాంధ్ర‌లో రికార్డు స్థాయిలో పాద‌యాత్ర చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఆ త‌ర్వాత ఆమె ఎంపీ సీటు ఆశించినా ఆమె కోరిక నెర‌వేర‌లేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో సోద‌రిని ఎంపీ బ‌రిలో దింపేందుకు జ‌గ‌న్ ఓకే చెప్పిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల స‌మాచారం. ష‌ర్మిల కోసం జ‌గ‌న్ క‌డ‌ప, విశాఖ‌పట్నం ఎంపీ స్థానాలను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

క‌డ‌ప ఎంపీ అవినాష్‌పై అసంతృప్తితో ఉన్న జ‌గ‌న్ ఆయ‌న్ను ఎమ్మెల్సీగా పంపి అక్క‌డ ష‌ర్మిల‌ను దింపాలా ? అని ఓ ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. ఇక విశాఖ‌లో విజ‌య‌ల‌క్షి ఓడిపోవ‌డంతో పోయిన‌చోటే వెతుక్కోవాల‌న్న చందంగా ష‌ర్మిల‌ను అక్క‌డ నుంచి పోటీ చేయించాల‌ని కొంద‌రు జగ‌న్‌కు చెప్పార‌ట‌. అయితే ఒంగోలులో జ‌గ‌న్ బాబాయ్ ఎంపీ సుబ్బారెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అద్దంకి నుంచి ఎంపీగా పోటీ చేయాల‌నుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ష‌ర్మిల కోసం జ‌గ‌న్ ఒంగోలును కూడా ఓ ఆప్ష‌న్‌గా ప‌రిశీలిస్తున్నార‌ట‌. మ‌రి ష‌ర్మిల కోరిక‌ను జ‌గ‌న్ ఏ సీటు నుంచి తీరుస్తారో ? చూడాలి.