గౌతంరెడ్డి ప‌క్కాప్లాన్‌తోనే ర‌చ్చ చేశాడా!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు గౌతం రెడ్డి పేరు విజ‌య‌వాడ రాజ‌కీయాలు, విజ‌య‌వాడ వ్య‌వ‌హారాల‌కే ప‌రిమితం అయింది. కానీ, వంగ‌వీటి రంగాపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చారు. నిజానికి రంగా త‌న‌యుడు రాధాకృష్ణ‌ అన్న‌ట్టు.. రంగాను విమ‌ర్శించే స్థాయి గౌతం రెడ్డికి లేనే లేదు. అయినా కూడా త‌న స్థాయిలేని వ్య‌క్తి, త‌న స్థాయి కాని వ్య‌క్తిని విమ‌ర్శించ‌డం ద్వారా రాష్ట్ర వ్యాప్త చ‌ర్చ‌కు దారి తీయడం వెనుక పెద్ద ప్లాన్ ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. గ‌తంలో తాను ప‌క్కా క‌మ్యూనిస్టున‌ని చెప్పుకొన్న గౌతం రెడ్డి సీపీఐ ఫ్లోర్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. అయితే, అనూహ్య కార‌ణాల నేప‌థ్యంలో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

2014లో వైసీపీ త‌ర‌ఫున విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ సంపాయించుకుని పోటీ చేసినా.. భారీ తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యాడు.అప్ప‌ట్లో కూడా జ‌గ‌న్ ఈయ‌న‌పై స‌ర్వే చేయించిన‌ప్పుడు గౌతం రెడ్డికి అసెంబ్లీకి పోటీ చేసేంత స్థాయి లేద‌ని తెలిసింది. అయినా స‌రే ఇంక క్యాండెట్లు లేక‌పోవడంతో గౌతంకే టికెట్ ఇచ్చారు జ‌గ‌న్‌. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ఎలాగైనా 2019లో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుమీదున్న జ‌గ‌న్‌.. గెలుపు గుర్రాల‌ను ప్రోత్స‌హించే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టున్న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లా ది విష్ణును పార్టీలోకి తీసుకున్నారు.

దీంతో ఇక‌, త‌న‌కు 2019లో పార్టీ టికెట్ ద‌క్క‌ద‌ని నిర్ణ‌యించుకున్న గౌతం రెడ్డి తెర‌వెనుక త‌న ప్లాన్ తాను రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎలాగూ ఏపీలో ఎద‌గాల‌ని నిర్ణ‌యించుకున్న బీజేపీలోకి చేర‌డం ద్వారా సెంట్ర‌ల్ టికెట్‌ను ద‌క్కించుకోవాల‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఏకైక మార్గంగా అదేస‌మ‌యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా గౌతం రెడ్డి ఎవ‌రు? అని చ‌ర్చ వ‌చ్చేలా ఇలా రెండు విధాలా ప్లాన్ వేసి స‌క్సెస్ అయిన‌ట్టు తెలుస్తోంది. అయితే, జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.