నంద్యాల ఉప ఎన్నికకు ముందు మాట… శిల్పా బ్రదర్స్‌గా బాగా పీక్‌లో ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి, మోహన్ రెడ్డిలు టీడీపీలో మంచి ఫామ్‌లో ఉన్నారు. మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా, శిల్పా చక్రపాణి.. ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరిద్దరికీ టీడీపీ అధినేత చంద్రబాబు మంచి స్టేజ్ ఇచ్చి గౌరవించారు. అయితే, ఇంతలోనే నంద్యాల ఉప పోరు షురూ అయింది. అంతే! శిల్పా బ్రదర్స్ జాతకాలు తారుమారయ్యాయి! శిల్పా మోహన్‌రెడ్డి.. నంద్యాల ఉప పోరులో టీడీపీ టికెట్ ఇవ్వలేదనే సాకుతో ఉన్న ఇంచార్జ్ పదవిని కాలదన్ని వైసీపీలోకి వెళ్లారు., ఇక, తొలుత అన్నవేరు రాజకీయాలు వేరు అని చెప్పినా.. తర్వాత మాత్రం ఆయన ప్లేట్ మార్చేశారు.
ఉన్న ఎమ్మెల్సీ పదవిని తృణ ప్రాయంగా తోసిపుచ్చి వైసీపీలోకి వెళ్లిపోయారు. అదే.. ఆ ఆవేశమే ఇప్పుడు చక్రపాణి రెడ్డికి పెను శాపంగా మారింది. బాబు మాటకు విలువ ఇచ్చి ఉంటే.. ఇప్పుడు శిల్పా చక్రపాణి శాసన మండలి చైర్మన్ పదవిని దక్కించుకుని కేబినెట్ హోదాను పొంది ఉండేవారు. కానీ, క్షణికావేశం ఆయనను అంధకారంలోకి నెట్టేసింది. ఇక, ఈ పదవిని మైనార్టీలకే కేటాయిస్తానని చెప్పిన బాబు అనుకున్నట్టుగానే సీనియర్ నేత ఫరూక్‌కు కట్టబెట్టారు. దీంతో ఇప్పుడు నంద్యాలలో శిల్పా బ్రదర్స్ అడ్రస్ లేకుండా పోయారనే టాక్ వినిపిస్తోంది.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఓటమిపై చణుకులు విసిరారు. సొంత పేపర్, ఛానెల్ లేకుండానే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించాం. పేపర్, ఛానెల్ ఉన్న విపక్షం ఘోరంగా విఫలమైంది.
గతంలో పార్టీకి దూరమైన వర్గాలు ఈ ఎన్నికల్లో టీడీపీకి దగ్గరవడమే అసలు విజయం. ఓటు బ్యాంకును కాపాడుకుందాం. కొత్త ఓటు బ్యాంకును సాధించుకోవడంతో గెలుపు సాధ్యమైంది. కులమతాలు, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టేందుకు విపక్షం ప్రయత్నించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు పెద్ద పీట వేశారు అని అన్నారు. మొత్తంగా బాబు వ్యూహం సఫలమైతే.. 2019లోనూ వైసీపీ గల్లంతేనని అంటున్నారు విశ్లేషకులు.