ఏపీలో బాబు టీం మారుతోందా? ఉండే దెవ‌రు?  పోయే దెవ‌రు?

అవును! అమ‌రావ‌తిలో ఈ చ‌ర్చ సాగుతోంది! అయితే, అతి ర‌హ‌స్యంగా మాత్ర‌మే. దీనికి ఇటీవ‌ల జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ మార్పులే ప్రామాణిక‌మ‌ని తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని త‌న ముద్ర ప‌డేలా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న టీంను మార్చుకున్నారు. కీల‌క‌మైన ప‌ద‌వుల‌ను సైతం సామాన్యుల‌కు అప్ప‌గించ‌గ‌ల‌న‌ని, త‌న‌కు సామ‌ర్థ్య‌మే ప్ర‌ధాన‌మ‌ని ఆయ‌న ర‌క్ష‌ణ శాఖ విష‌యంలో నిర్మ‌ల‌ను నియ‌మించ‌డం ద్వారా నిరూపించేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏపీలోనూ చంద్ర‌బాబు ఆదిశ‌గానే అడుగులు వేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అంటే, 2019లో లేదా అంత‌క‌న్నా ముందుగా 2018 డిసెంబరులోనే ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఎదుర్కొని నిలిచి, గెలిచే టీంను ఆయ‌న సిద్ధం చేసుకోవాల‌ని డిసైడ్ అయ్యార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత మంత్రుల జాత‌కాలు, ప‌నితీరును ఆయ‌న మ‌రోసారి ఇంటిలిజెన్స్ స‌ర్వే స‌హా పార్టీ వ్య‌క్తిగ‌త నిఘా బృందంతోనూ స‌ర్వే చేయించి నివేదిక‌లు తెప్పించుకుంటున్నార‌ట‌. నిజానికి ఈ విష‌యం నిన్న విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన జ‌ల‌సిరికి హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం త‌న‌యుడు, మంత్రి లోకేష్ నోటి నుంచే వెల్ల‌డ‌యి పోయింది. మంత్రుల ప‌నితీరుపై(ఎమ్మెల్యేల‌పై కాదు) సీఎం మ‌రోసారి వ్య‌క్తిగ‌త నివేదిక‌లు, ఇంటిలిజెన్స్ నివేదిక‌లు తెప్పించుకుంటున్నార‌ని, కొడుకునైన త‌న‌పైనా నిఘా ఉంద‌ని, ప‌నిచేసేవారిని ప్రోత్స‌హిస్తార‌ని, ప‌నిచేయ‌క‌పోతే.. త‌న‌నైనా ప‌క్క‌న పెట్టేందుకు అధినేత చంద్ర‌బాబు రెడీగా ఉన్నార‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఈ నివేదిక వ‌చ్చే నెల‌లో వ‌స్తుంద‌ని, అప్పుడు సీఎం స్వ‌యంగానే మంత్రుల‌కు చెబుతార‌ని కూడా లోకేష్ చెప్పుకొచ్చారు.

దీనిని బ‌ట్టి ఖ‌చ్చితంగా ఏపీలో మంత్రుల‌పై స‌ర్వే ఖ‌డ్గం వేలాడుతోంద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. అంతేకాదు,లోకేష్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. మంత్రి వ‌ర్గవిస్త‌ర‌ణ కూడా ఉండే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో మంత్రిగా ఉండికూడా భూక‌బ్జాల‌పై బ‌హిరంగ ఆరోప‌ణ‌ల‌కు దిగిన అయ్య‌న్న‌పాత్రుడిపై బాబు అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా అవినీతి ఆరోప‌ణ‌లు స‌హా వైద్యుల‌లో క్ర‌మ శిక్ష‌ణ‌ను తీసుకురాలేక‌పోతున్నార‌ని బీజేపీ కి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ ప‌నితీరుపైనా సీఎం అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, మంత్రి గంటా శాఖ మార్పు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ప‌రిటాల సునీత ప‌నితీరు బాగోపోయినా.. సెంటిమెంట్ నేప‌థ్యంలో ఆమెను మ‌రోసారి అప్రాధాన్య శాఖ‌కు మార్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక‌, ప్ర‌భుత్వానికి బాగా ప‌నికొస్తారని భావిస్తున్న బొండా ఉమా, వంగ‌ల‌పూడి అనిత‌, బుచ్చ‌య్య చౌద‌రి, డీకే ర‌త్న‌ప్ర‌భ‌, స్పీక‌ర్ కోడెల, ధూళిపాళ్ల న‌రేంద్ర‌, ప‌య్యావుల కేశ‌వ్‌ల‌కు కీలక పోస్టులు క‌ట్ట‌బెట్టే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.