టీటీడీ కొత్త చైర్మ‌న్ ఎంపిక వెన‌క పెద్ద క‌థే ఉందా..!

అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడైన శ్రీ తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుని దేవ‌స్థానం టీటీడీ ట్రస్టు బోర్డులో స‌భ్య‌త్వం వ‌స్తే చాలు అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ స‌భ్యత్వం కోసం తమ స‌ర్వ‌స్వం ధార పోసేవారూ ఉన్నారు. ఇక‌, ఈ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి అంటే ఇంకెంత రేంజ్ ఉంటుందో ఆలోచించాలి. అందుకే కాబోలు.. 2014లో ఎంతో వ్య‌య, ప్ర‌యాస‌ల‌కోర్చి ప్ర‌జాక్షేత్రంలో గెలిచిన ఎంపీ సీటును సైతం ఈ చైర్మ‌న్‌గిరీ కోసం తృణ‌ప్రాయంగా వ‌దులుకుంటాన‌ని, బాబు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని ఇస్తానంటే.. ఈ క్ష‌ణ‌మే ఎంపీ సీటుకు రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు గుంటూరు ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు. అంత‌గా ఆ సీటు కోసం పోటీ నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

శ్రీవారి ద‌ర్శ‌నం ఒక్క‌సారి జ‌రిగితే చాలు.. అనుకునే స్థాయి నుంచి నిత్యం స్వామి సేవ‌లోనే త‌రించ‌డం, స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించే అవ‌కాశం ఈ బోర్డుకు ఉంది. అందుకే ఈ చైర్మ‌న్ గిరీకి ఇంత డిమాండ్‌. ఇక‌, గ‌తంలో చ‌ద‌లవాడ చైర్మ‌న్‌గా ఉన్న టీటీడీ బోర్డు ర‌ద్ద‌యిపోయింది. దీనిస్థానంలో కొత్త‌దానిని ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. బాబు రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉండ‌డంతో ఈ బోర్డు ఎన్నిక ఆల‌స్య‌మైంది. అయితే, తాజాగా బోర్డు చైర్మ‌న్ గా ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, టీటీడీ సీనియ‌ర్ నేత సీఎం ర‌విశంక‌ర్ పేరు తెర‌మీద‌కి వ‌చ్చింది.

రవి శంకర్‌ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బడా వ్యాపారవేత్త. ఏడాది కాలం పాటు ఆయన టీటీడీ చైర్మన్ గా కొనసాగుతారు. దీంతోపాటు 19 మంది సభ్యలతో కూడిన టీటీడీ పాలకమండలిని కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. బోర్డు సభ్యులుగా.. సుధా నారాయణ మూర్తి, కృష్ణమూర్తి, కోలా ఆనంద్, చింతల రామచంద్రా రెడ్డి, రాఘవేంద్ర రావు, ఎమ్మెల్యే కొండబాబు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్ మోహన్ సింగ్, ఎండోమెంట్ కమిషనర్‌ వై.వి. అనూరాధ, టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఇందులో ఉన్నారని తెలుస్తోంది.

అయితే, ఈయ‌న పేరు ఇంకా ఖ‌రారు కావాల్సి ఉంది. కానీ, ఈ ప‌ద‌వికి టీడీపీలో ఉద్ధండులైన నేత‌లు హరిక్రిష్ణ – ఎంపీలు మురళీమోహన్ – రాయపాటి సాంబశివరావు – రిటైర్డ్ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణలు పోటీ ప‌డినా.. అక‌స్మాత్తుగా సీఎం ర‌విశంక‌ర్ పేరు వెలుగులోకి రావ‌డానికి వెనుక చాలా క‌థే న‌డిచిన‌ట్టు తెలుస్తోంది.

ఈయ‌న వెనుక‌.. ఆధ్యాత్మికవేత్తలు బాబా రాందేవ్ – రవిశంకర్ స‌హా పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఉన్నార‌ని స‌మాచారం. వీరు ముగ్గురూ ప్రతిపాదించి చంద్రబాబు దృష్టికి తేవడంతో రవిశంకర్ పేరు తెర‌మీద‌కి వ‌చ్చింద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీనికితోడు ఈయ‌న టీడీపీ సభ్యుడు, వివాదరహితుడు కావడంతో బాబు నుంచి సానుకూల‌త వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదేవిధంగా బోర్డు స‌భ్యుల నియామ‌క‌మూ చేప‌ట్టాల్సి ఉంది. ఏదేమైనా టీటీడీ చైర్మ‌న్ గిరీ వెనుక ఇంత క‌స‌ర‌త్తు జ‌రిగింద‌న్న‌మాట‌!