హోరా హోరీ పోరుకు కవిత సిద్దమేనా…!

తెలంగాణలో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించిన సీఎం కేసీఆర్ త‌న‌య‌, తెలంగాణ జాగృతి పేరుతో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్య‌మాన్ని వాడ వాడ‌ల్లోకి గ‌డ‌ప గ‌డ‌ప‌లోకి తీసుకువెళ్లిన పోరు నారి.. క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ఇప్పుడు తెలంగాణ ఉద్య‌మం లాంటి అగ్ని ప‌రీక్ష ఎదురైంది.! త‌న వాక్చాతుర్యంతో అంద‌రినీ ఆక‌ట్టుకునే ఈ యువ నారి.. స‌టైర్ల‌తో ఎదుటి వారిని కుమ్మేయ‌డ‌మేకాకుండా.. జ‌నాల్ని ఆక‌ట్టుకోవ‌డంలోనూ నాన్న‌కు త‌గ్గ కూతురే! ఇక‌, నిజామాబాద్ ఎంపీగా కూడా చ‌క్రం తిప్పుతున్న క‌విత 2014 ఎన్నికల స‌మ‌యంలో ఒక్క‌సారే హోరా హోరీ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క జీహెచ్ ఎంసీ త‌ప్ప ఎలాంటి పెద్ద ఎన్నికా తెలంగాణ‌లో జ‌ర‌గ‌లేదు.

జీహెచ్ఎంసీని కూడా కేటీఆర్‌, హ‌రీశ్‌రావులు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. దీంతో క‌విత‌కు త‌న‌ను తాను నిరూపించుకునే మ‌రో అవ‌కాశం ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్క‌లేద‌నే చెప్పాలి. ఇక‌, ఇప్పుడు తాజ‌గా.. ఆమె నాయ‌క‌త్వానికి పెద్ద అగ్నిప‌రీక్ష ఎదురైంది. త్వ‌ర‌లోనే సింగ‌రేణి బొగ్గుగ‌ని కార్మికుల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణకు వరప్రదాయిని – రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో కీలకమైన సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికకు నగారా మోగింది.

అధికార‌ టీఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎంపీ కవిత వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో అంద‌రి దృష్టీ క‌విత‌వైపు మ‌ళ్లింది! సింగ‌రేణి ఎన్నిక‌ల్లో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? ఆమె విజ‌య బావుటా ఎగ‌రేస్తుందా? లేదా? వ‌ంటి అనేక ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కి వ‌చ్చాయి. దీనికి కార‌ణం లేకుండా పోలేదు. గత కొద్దికాలంగా సింగరేణిలో టీఆర్ ఎస్ కు పట్టు తగ్గుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదీ కార‌ణం..

ఎన్నో ఏళ్ల నుంచి సింగరేణి కార్మికులు త‌మ ఉద్యోగాల‌ను త‌మ వార‌సుల‌కు ఇచ్చేలా హ‌క్కులు క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వాల‌కి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అయితే, గ‌త ప్ర‌భుత్వాలు ఈ డిమాండ్‌ను తోసిపుచ్చాయి. అయితే, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. వీరికి ఈ మేర‌కు హామీ ఇచ్చారు. వార‌స‌త్వంగా త‌మ ఉద్యోగాల‌ను త‌మ పిల్ల‌ల‌కు ఇచ్చుకునేలా ఓ జీవో కూడా సీఎం పాస్ చేయించారు.అ యితే, దీనిని కొంద‌రు కోర్టులో స‌వాలు చేయ‌డంతో ప్ర‌స్తుతం ఇది నిలిచిపోయింది. ఈ ప‌రిణామంపై ప్ర‌భుత్వం కూడా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉంద‌ని కార్మికులు భావిస్తున్నారు. ఏదో మా క‌ళ్లు తుడ‌వ‌డానికి ఈ జీవో తెచ్చార‌ని, కోర్టులో కేసు త్వ‌ర‌గా తేలి, త‌మ‌కు న్యాయం జ‌రిగేలా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌నేది వీరి వాద‌న‌.

దీంతో ఇప్పుడు ఈ కార్మికుల్లో అధికార పార్టీకి ఎంత మంది మొగ్గు చూపుతారు ? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇదిలావుంటే, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వ‌హించ‌డం ఖ‌రారైపోయిన నేప‌థ్యంలో క‌విత దీనిని ఎలా నెగ్గుకొస్తారాని? అంద‌రూ ఎదురు చూస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.