ప‌శ్చిమ టీడీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం త‌న్నులాట..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంగా గ‌ట్టిగా మ‌రో 18 నెల‌ల టైం మాత్ర‌మే ఉంది. మ‌రోసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు త‌మ ఏర్పాట్లు తాము చేసుకుంటుండ‌గా, కొత్త‌గా ఎన్నిక‌ల్లో పోటీ చేసే వాళ్లు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం త‌మ‌కు అనువైన స్థానాలను చూసుకునే ప‌నిలో ఉన్నారు. ఎమ్మెల్యే అవ్వాల‌న్న కోరిక ఎవ్వ‌రికి మాత్రం ఉండ‌దు. ఎమ్మెల్యే అవ్వాల‌నుకున్న వాళ్ల‌కు అంద‌రికి టిక్కెట్లు వ‌చ్చేయ‌డానికి అవి మామూలు సీట్లు కాదు క‌దా..!

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఏపీలో ఎమ్మెల్యే సీట్ల కోసం ర‌చ్చ ర‌చ్చ జ‌ర‌గ‌డం ఖాయం. విప‌క్ష వైసీపీలో ఎలా ఉన్నా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుంద‌న్న ఆశ చూపి విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌ను భారీగా త‌మ పార్టీలో చేర్చుకున్న చంద్ర‌బాబుకు, టీడీపీ నాయ‌కుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్ల పంపిణీ వేళ చుక్క‌లు క‌న‌ప‌డ‌డం ఖాయం.

ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ టిక్కెట్ ద‌క్కించుకునేందుకు అధికార పార్టీ నేత‌లు స్కెచ్‌లు వేసుకుంటున్నారు. ఈ స్కెచ్‌ల్లో త‌మ పార్టీ వాళ్ల‌నే ఒక‌రిని ఒక‌రిని దెబ్బ తీసేందుకు, తెర వెన‌క గోతులు తీసేందుకు కూడా వారు వెనుకాడ‌డం లేదు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి టిక్కెట్లు ఆశిస్తోన్న వారిలో ప్ర‌ధానంగా చూస్తే ఏలూరు ఎంపీ సీటు కోసం మాజీ కేంద్ర‌మంత్రి బోళ్ల బుల్లిరామ‌య్య మ‌న‌వ‌డు బోళ్ల రాజీవ్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అక్క‌డ సిట్టింగ్ ఎంపీ బాబును త‌ప్పించాలంటే ఆయ‌న‌కు క‌నీసం ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి. నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌డం లేదు కాబ‌ట్టి ఆయ‌న‌కు ఆప్ష‌న్ లేదు. బాబుకు రాజీవ్ బంధువు అవుతారు. ఇది బాబుకు పెద్ద చిక్కే.

ఇక బాబుకే ఇంత ఇబ్బంది ఉంటే ఆయ‌న త‌న‌యుడు రాంజీ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటున్నాడు. ఆయ‌న ఆశ‌లు నెర‌వేరే ఛాన్సే లేదు. ఇక జ‌డ్పీచైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అయితే ఆయ‌న‌కు ఇప్పుడు తాడేప‌ల్లిగూడెం ఒక్క‌టే ఆప్ష‌న్ ఉంది. బీజేపీతో పొత్తు కంటిన్యూ అయితే ఆయ‌న‌కు సీటు రాదు. లేనిప‌క్షంలోనే సామాజిక స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఆయ‌న‌కు గూడెం సీటు ఎంత వ‌ర‌కు వ‌స్తుంద‌నేది చెప్ప‌లేం.

ఇక లోకేశ్‌కు అతి స‌న్నిహిత వ్య‌క్తి అయిన చాగ‌ల్లు జ‌డ్పీటీసీ అల్లూరి విక్ర‌మాదిత్య కూడా ఎమ్మెల్యే సీటు కోసం రేసులో ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న‌కు స‌రైన ఆప్ష‌న్ లేదు. నిడ‌ద‌వోలు టిక్కెట్ విక్ర‌మాదిత్య అడుగుతున్నా అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేను త‌ప్పించి కొత్త వ్య‌క్తికి ఇవ్వాల‌ని అధిష్టానం భావిస్తోంది. ఇక్క‌డ సీటు విక్ర‌మాదిత్య‌కు ద‌క్క‌డం క‌ష్ట‌మే.

కొంద‌రు సిట్టింగ్‌ల‌కు ఎర్త్ త‌ప్ప‌దా..!

ఇదిలా ఉంటే బీజేపీ-వైసీపీకి ద‌గ్గ‌ర‌వుతోన్న వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ+జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తాయ‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకుంటే ప్ర‌స్తుతం ఉన్న కొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు ఎర్త్ త‌ప్ప‌ద‌న్న టాక్ వ‌చ్చేసింది. కాపులు బ‌లంగా ఉన్న డెల్టాలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను త‌ప్పించి ఆ సీట్ల‌ను జ‌నసేన‌కు కేటాయిస్తార‌ని తెలుస్తోంది.

ఇక జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరు సీటుకు మేయ‌ర్ నూర్జ‌హాన్ భ‌ర్త ఎస్ఎంఆర్‌.పెద‌బాబు పేరు కూడా వినిపిస్తోంది. ఇక ఇదే సీటును పొత్తులో భాగంగా జ‌న‌సేన కూడా అడిగే ఛాన్సులు ఉన్నాయి. అలాగే ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలోని పోల‌వ‌రం సీటు కూడా జ‌నసేన‌కు ఇస్తార‌న్న చ‌ర్చ‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఇక జ‌న‌సేన‌తో పొత్తు కుదిరితే న‌ర‌సాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు సీట్లు ఖ‌చ్చితంగా జ‌న‌సేన‌కు ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఈ ప‌రిస్థితులు అన్ని చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార టీడీపీలో టిక్కెట్ల కోసం ఓ రేంజ్‌లో ఫైటింగ్ షురూ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.