క‌ర్నూలులో మొద‌లైన టికెట్ లొల్లి

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ టీడీపీ నాయ‌కుల్లో ఉన్న‌వ‌ర్గ విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. ఎన్నికల బరిలో ఉంటామని ఒకరు.. అభ్యర్థి నేనే అంటూ మరొకరు ప్రకటన చేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన‌ ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో అంత‌ర్గ‌తంగా ఉన్న క‌ల‌హాలు.. ఇప్పుడు బ‌య‌ట‌ప‌డు తున్నాయి. ముఖ్యంగా ఆయా నేత‌ల వార‌సులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు దుమారం రేపుతున్నాయి. క‌ర్నూలు జిల్లాలో టీజీ, ఎస్వీ వ‌ర్గాల మ‌ధ్య క‌ల‌హాలు ఇప్పుడు సీఎం చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పులు తీసుకొస్తున్నాయి. ఎంపీ టీజీ వెంక‌టేశ్ త‌న‌యుడు టీజీ భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు.. రెండు వ‌ర్గాల మ‌ధ్య చిచ్చురేపాయి.

కర్నూలు ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా టీజీ వెంకటేశ్‌ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఎస్వీ మోహన్‌రెడ్డిపై గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల్లో భాగంగా ఎస్వీ మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అప్పటికే నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న టీజీ వెంకటేశ్‌ ఎస్వీ రాకను బాహాటంగా వ్యతిరేకించకపోయినా అంతర్గతంగా అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం. సమన్వయంతో పనిచేయాలని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సీఎం చంద్రబాబు వారిని సూచించారు. తొలుత ఇద్దరూ ప‌నిచేశారు. టీజీ వెంకటేశ్‌కు అదిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. వీరు కలిసిన‌ట్లు ఉన్నా.. ద్వితీయ శ్రేణి నాయ‌కులు మాత్రం క‌ల‌వ‌లేదు.

టీజీ వెంకటేశ్‌ తన కుమారుడు టీజీ భరత్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని వ్యూహాత్మక ఎత్తులు వేస్తు న్నారు. అందులో భాగంగానే గత ఏడాది కాలంగా టీజీ భరత్‌ యూత్‌, స్పోర్ట్స్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నా రు. ఈ నేప‌థ్యంలోనే రాబోయే ఎన్నికల్లో కర్నూలు బరిలో ఉంటానని భరత్ ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు క‌ర్నూలులో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. టీడీపీలో ఉంటూ పార్టీ అభ్యర్థిగా ప్రకటించకముందే పోటీ చేస్తాననడంతో ఆ పార్టీ నాయకుల్లో చలనం మొదలైంది. దీనిపై ఎస్వీ వ‌ర్గం ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తోంది. 2019 ఎన్నికల్లో కర్నూలు టీడీపీ అభ్యర్థి నేనే.. టీజీ భరత్‌ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పాలి.. అంటూ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. అప్పుడే ఇంతకు రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ ఎవరికి ఇస్తుంది అనే విష‌యాల‌పై ఇప్ప‌టినుంచే ఎవ‌రికి వారు వ్యూహంతో దూసుకుపోతున్నారు. అభ్య‌ర్థి మేమంటే మేము అని అధినేత దృష్టిలో పడే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇలా ఉంటే.. ఇక రానున్న రోజుల్లో మ‌రిన్ని ఇబ్బందులు ప‌డ‌క త‌ప్ప‌దు. మ‌రి ఎవ‌రికి వారు ఇప్ప‌టినుంచే ప్ర‌యత్నాలు చేసేస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీలో రాజకీయ కలకలం మొదలైంది. ఈ విభేదాన్ని చంద్ర‌బాబు ఎలా చల్లారుస్తుందో వేచిచూడాల్సిందే!!