నంద్యాల తీర్పు వచ్చేసింది. అధికార పార్టీ విజయాన్ని కైవసం చేసుకుని సైకిల్‌పై రివ్వున సాగిపోయింది. తమదే సీటని భావించి, అతికిపోయిన వైసీపీ చతికిల పడింది. ఇది వాస్తవం!! ఏ జర్నలిస్టయినా.. పత్రికైనా ముందుగా రాయాల్సింది ఇదే! ఇక, ఆ తర్వాత వారివారి అభిమానాన్ని బట్టి.. వార్తల ప్రచురణ ఉండాలి. కానీ, ఈ విజయాన్ని కూడా ఏకపక్షంగా చూడడం అనేదే ఇప్పుడు అసంతృప్తికీ.. జర్నలిజంపై రాళ్లేయడానికి అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ స్థాపించిన పత్రిక సాక్షి… నంద్యాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వార్తలను నిష్కర్షగా ప్రచురించిందా? ఉన్నది ఉన్నట్టు రాయగలిగిందా? అంటే లేదనే సమాధానమే వస్తోంది ప్రజాస్వామ్య వాదుల నుంచి.
ఏ ఎన్నికైనా, ఏ ఆటైనా.. ఎంతబాగా ప్రచారం చేసినా.. ఒళ్లు విరగదీసుకుని కష్టపడినా.. గెలుపు ఏదో ఒక్కరినే వరిస్తుంది. అదే సూత్రం నంద్యాలలోనూ పనిచేసింది. అధికార, విపక్షాలు వేటికవే గెలుపు కోసం నానా తిప్పలు పడ్డాయి. ఈ ప్రచార విషయాలను వెల్లడించడం, ఫొటోలతో దంచికొట్టడం వంటివి సర్వసాధారణం. అయితే, నిన్నటి ఫలితం మాత్రం టీడీపీకే అనుకూలంగా వచ్చింది. సైకిల్ గుర్తుపై పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి గెలు పు గుర్రం ఎక్కారు. దీనిని మనస్పూర్తిగా ఒప్పుకొని తీరాల్సిందే. అదేసమయంలో గెలుపునకు కారణమైన ప్లస్‌లపైనా దృష్టి పెట్టాలి.
ఇక, ఇంత భారీగా ప్రచారం చేసినా.. ఓటమి పాలవడానికి కారణాలపైనా దృష్టి పెట్టాలి. వైసీపీ లోపాలు ఏమిటి? ఏ వ్యూహం అమలు చేయడంలో లోపం జరిగింది? వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టి ఉండాల్సింది. అయితే, ఈ దిశగా ఎలాంటి కసరత్తూ చేయకుండా వైసీపీ అధినేత జగన్ పత్రిక సాక్షి.. ఏకపక్షంగా కథనాలు రాసేసింది. నిజానికి విలువలతో కూడిన, నైతికతతో కూడిన జర్నలిజానికి కేరాఫ్‌గా చెప్పుకొనే ఈ పత్రికలో ఇలాంటి కథనాలు రావడం అత్యంత దారుణమనే వ్యాఖ్య ప్రజాస్వామ్య వాదుల నుంచే వినిపిస్తోంది.
సొంత పార్టీ నేత కాబట్టి.. సాక్షికి ఈ ఓటమి జీర్ణించుకోలేనిదే కావొచ్చు. కానీ, సగటు రాజకీయ నేతగా మారిపోవాల్సిన అవసరం పత్రికకు లేదు కదా? భారీ పోరులో గెలుపు ఒకరినే వరిస్తుందన్న ఘాటు నిజం ఎవరికి తెలియదు. ఓడలు బళ్లు.. అనే సూత్రం రాజకీయాల్లో కామన్. ఒకనాడు ఇదే చంద్రబాబు.. తనకు మద్దతిచ్చే నేతల కోసం.. కాలికి బలపం కట్టుకుని ఊరు ఊరూ వీధివీధీ తిరిగిన విషయం పాత్రికేయులుగా ఎందుకు మరిచిపోతున్నారు. ఎంత కష్టపడితే.. మరోసారి బాబు అధికారంలోకి వచ్చారో ఎందుకు విస్మరిస్తున్నారు?
ఇలాంటి అనేక ఉదాహరణలతో జగన్‌కు దిశానిర్దేశం మానేసి.. ఆవేశమనే తాలింపుతో వార్తలను వండి వారిస్తే.. నష్టపోయేది ఎవరు? నష్టం కలిగించేది ఎవరికి? వెనుకేస్తున్నాం.. అనే మాట మాటున జగన్‌కు చేస్తోంది, తీస్తోంది అక్షరాలా గోతులే! నిబద్ధత గల పత్రికగా నిజాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే పాలనకు గీటురాయి! అన్న సూత్రాన్ని విస్మరిస్తే.. రాజకీయ ప్రతికకు, వార్తా పత్రికకు తేడా ఏమిటి? నేతల అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ.. బాబు ఓట్లను కొన్నారు, డబ్బులు పంచి గెలిచారు, ఇదసలు గెలుపే కాదు, వంటి వార్తలను ప్రచురించవచ్చు. కానీ ఓ వార్తా పత్రికగా సాక్షి ప్రచురించాల్సిన వార్తలు ఏమిటి? నిన్నటి ఫలితాన్ని నిష్కర్షగా ఒప్పుకోవడం, అభిమాన నేతకు దిశానిర్దేశం చేయడం, ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను ఏకరువు పెట్టడం- ఈ గురుతర బాధ్యతను విస్మరిస్తున్న సాక్షి.. జగన్ చేసేది మేలు కాదు.. కీడే సుమా!!