నంద్యాల రిజ‌ల్ట్ టీడీపీ, వైసీపీ ఇద్ద‌రికీ గుణ‌పాఠ‌మే.. ఇలా

ఓ పెద్ద తుఫాను తీరం దాటింది! నంద్యాల ఉప పోరు ఫ‌లితం వెల్ల‌డైపోయింది. గెలుపు అధికార ప‌క్షం సైకిలెక్కేసింది. రివ్వున తిరుగుతుంద‌ని అనుకున్న ఫ్యాన్‌కు రెక్క‌లు తెగిపోయాయి. ఇక‌, మ‌ళ్లీ ఎన్నిక‌లు రావాలంటే ఏడాదిన్న‌ర‌కు పైగా ఆగాల్సిందే. అయితే, ఈ నంద్యాల పోరు.. నిన్న‌టి ఫ‌లితం అటు అధికార ప‌క్షానికి, ఇటు విప‌క్షానికీ అనేక పాఠాలు నేర్పుతోంది. భ‌విష్య‌త్ వ్యూహాల‌కు ఎలా ప‌దును పెట్టాలి? ప‌్ర‌జ‌ల నాడి ఏమిటి? రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు ఎంత సంయ‌మ‌నంగా వ్య‌వ‌హ‌రించాలి? ఎంత ఓర్పు అవ‌స‌రం? ప్ర‌జ‌ల‌ను ఎలా ఆక‌ర్షించాలి? ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు? ఇలా అనేక విష‌యాలకు నంద్యాల పాఠ్యాంశంగా మారిపోయింది!

నిజానికి చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు.. త‌మ అభివృద్ధి మంత్ర‌మే నంద్యాల‌లో ప‌నిచేసింద‌నేది నిజ‌మేనా? అయితే, ఇదే సూత్రంతో 2019లోనూ విజ‌యం సాధించ‌గ‌ల‌రా? నంద్యాల‌లో డంప్ చేసిన‌ట్టు ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలోనూ 10 మంది మంత్రుల‌ను క‌ట్ట‌క‌ట్టి పంపించ‌గ‌ల‌రా? జ‌గ‌న్ అన్న‌ట్టు నంద్యాల మాదిరిగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నిధులు పారించ‌గ‌ల‌రా? ఇక్క‌డ సాధ్య‌మైంది క‌దా? అంటే. ఇది కేవ‌లం ఓ నియోజ‌క‌వ‌ర్గం మాత్ర‌మే. కాబ‌ట్టి సాధ్య‌మై ఉండొచ్చు. కానీ, 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇలా చేయ‌డం అంటే దుస్సాధ్యం. కాబ‌ట్టి.. నంద్యాల గెలుపు కేవ‌లం సెంటిమెంట్ పాళ్లు ఎక్కువ‌గా ఉండి అభివృద్ధి పాళ్లు.. అమ‌రాయి కాబట్టి సాధ్య‌మైంద‌న్న విష‌యం గుర్తించాలి.

భ‌విష్య‌త్ వ్యూహంతో ముందుకు సాగాలి. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎన్నిక‌లొస్తేనే గుర్తిస్తాం.. నిధులిస్తాం.. అన్న ధోర‌ణిని విడిచి పెట్టి ఇప్ప‌టి ఉంచి అభివృద్ధి బాట ప‌ట్టించాలి. అప్పుడే మ‌రోసారి సీఎం సీటు ద‌క్కేది. ఇక‌, వైసీపీ విష‌యానికొస్తే… త‌న బాధ‌ను జ‌నం బాధ‌లు చేశాడు జ‌గ‌న్ అనే చ‌ర్చ‌కు తావిచ్చేలా ప్ర‌వ‌ర్తించారు. బాబుపై ఉన్న అక్క‌సు, సీఎంసీటు ద‌క్క‌లేద‌నే బాధ.. నంద్యాల ప్ర‌చారంలో కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించాయి. నిజానికి ప్ర‌తిప‌క్ష నేత అనేవాడు.. తానే నేరుగా అధికార ప‌క్షంపై రాళ్లేసేయ‌డం కాదు.. విజ్ఞ‌త ఉండి.. ప్ర‌జ‌ల‌తో వేయించ‌గ‌లిగేలా చేయాలి.

అది విప‌క్షానికి ప్ల‌స్‌.. అధికార ప‌క్షానికి మైన‌స్ అవుతుంది. కానీ, జ‌గ‌న్‌.. జ‌నం చేయాల్సిన ప‌నిని తానే చేశాడు. అస‌లు జ‌నం బాబును వ్య‌తిరేకిస్తున్నారా? లేదా? ఎంత మేర‌కు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉంది? ముఖ్యంగా మాస్ మ‌హిళ‌ల్లో బాబుపై ఎలాంటి అభిప్రాయం ఉంది? నిజంగానే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఎంత‌మేర‌కు అమ‌ల‌వుతున్నాయి? ఎంత మేర‌కు ఫెయిల‌వుతున్నాయి? వ‌ంటి ప్ర‌ధాన విష‌యాల‌పై ఏనాడూ ఇత‌మిత్థంగా దృష్టి పెట్టింది లేదు. కేవ‌లం నాలుగు మాట‌ల రాళ్లు రువ్వేస్తే.. జ‌నం న‌మ్మేస్తార‌ని, నాలుగు బూతులు తిడితే.. బాబుపై వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌ని జ‌గ‌న్ అనుకున్నారు.

కానీ, ఇది సోష‌ల్ మీడియా ప్ర‌పంచం. ఇదిగో పులి అనేలోపే.. ఇదిగో త‌ల అనే టైపు మ‌నుషుల మ‌ధ్య స‌మాజం అనేక పోక‌డ‌లు పోతోంది. చేతిలోనే స‌ర్వ ప్ర‌పంచం ఇమిడిపోయింది. ఎవ‌రేమిటో తెలియ‌ని, తెలుసుకోలేని అమాయ‌క జ‌నం కారు ఇప్పుడున్న‌వారు. కాబ‌ట్టి.. జ‌గ‌న్ మారాలి. నోటికి ఏది వ‌స్తే అది.. ఎలా ప‌డితే అది.. త‌న బాధ‌ను జ‌నం బాధ‌ను చేయ‌డం.. త‌న స‌మ‌స్య‌ను జ‌నం స‌మ‌స్య‌గా రాయించ‌డం వంటి వాటికి త‌క్ష‌ణ‌మే స్వ‌స్తి చెప్పాలి. జ‌నం స‌మ‌స్య‌ను త‌న స‌మ‌స్య‌గా, జ‌నం బాధ‌ల‌ను త‌న బాధ‌లుగా మార్చి.. మ‌లిచి.. ప్ర‌చారం చేసి.. బాబుపై ప్ర‌జ‌లే తిర‌గ‌బ‌డేలా.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెంచ‌గ‌లిగేలా చేసిన‌ప్పుడే.. జ‌గన్ క‌ల‌లు తీరేది! ఇదే నంద్యాల నేర్పిన పాఠం!! మ‌రి బాబు, జ‌గ‌న్‌లు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరుస్తారా?!