గోస్పాడులో వైసీపీకి ఎందుకు దెబ్బ ప‌డిందంటే…

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెల్లడైంది. ప్రజలు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని ఎవ్వ‌రూ ఊహించ‌ని మెజార్టీతో గెలిపించారు. నంద్యాల రూరల్, నంద్యాల అర్బన్ విషయం పక్కన పెడితే గోస్పాడు మండలంలో కూడా టీడీపీనే ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ ఉప ఎన్నిక హ‌డావిడి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి గోస్పాడు మండ‌లంలో వైసీపీకి తిరుగులేని మెజార్టీ వ‌స్తుంద‌ని, ఆ మండ‌లం నుంచి వ‌చ్చే మెజార్టీయే త‌మ‌ను గెలిపిస్తుంద‌ని వైసీపీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది.

చాలా నివేదిక‌లు, స‌ర్వేలు, చివ‌ర‌కు ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేతో పాటు టీడీపీ వాళ్ల స‌ర్వేల్లో కూడా ఈ మండ‌లంలో వైసీపీకి ఎంతోకొంత మెజార్టీ వ‌స్తుంద‌నే తేలింది. అయితే ఓట‌రు మాత్రం వైసీపీకి అదిరిపోయే షాక్ ఇచ్చాడు. అటు టీడీపీకి ఉహ‌కు అంద‌న‌ట్టుగా మెజార్టీ ఇచ్చి వైసీపీకి దిమ్మ‌తిరిగిపోయేలా చేశాడు.

గోస్పాడు మండ‌లంలోని గోస్పాడు, యాళ్లూరు, ఎంక్రిష్ణాపురం, దీబగుంట్ల, పార్వతీపురం, జిల్లేళ్ల, జులేపల్లి, చింతకుంట్ల, పసురపాడు, తేళ్లపురి గ్రామాలు ఈ మండల పరిధిలో ఉన్నాయి. గోస్పాడు మండలంలో మొత్తం 28,844 ఓట్లకు గానూ 26,193 ఓట్లు పోలయ్యాయి. ఇక్క‌డ త‌మ‌కు 8 వేల వ‌ర‌కు మెజార్టీ వ‌స్తుంద‌ని వైసీపీ అనుకుంటే టీడీపీకే 1858 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఇక్క‌డ టీడీపీకి 10,521 కోట్లు వ‌స్తే, వైసీపీకి 8663 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది.

ఇక్క‌డ వైసీపీ సీన్ రివర్స్ అవ్వ‌డానికి దివంగ‌త భూమా నాగిరెడ్డి మీద ఉన్న అభిమానం ఇంకా చెక్కుచెద‌ర్లేద‌ని అర్థ‌మ‌వుతోంది. 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి వైసీపీ తరుపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో భూమాకు ఒక్క గోస్పాడు మండలంలోనే 5000 పైచిలుకు ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీ మారినా ఆయ‌న‌పై ఉన్న అభిమానాన్ని మాత్రం గోస్పాడు ఓట‌ర్లు చాలా వ‌ర‌కు అలాగే చూపించారు. దీంతో ఇక్క‌డ టీడీపీకే మెజార్టీ ద‌క్కింది.