పీకే ప్రాధాన్యం వైసీపీలో త‌గ్గిన‌ట్టేనా?

పార్టీలో నేత‌లు ఎంత మంది వ‌ద్ద‌ని చెప్పినా విన‌లేదు! ముందొచ్చిన చెవుల‌కంటే వెన‌కొచ్చిన కొమ్ములే వాడి అన్న చందంగా.. పార్టీలోని సీనియ‌ర్ల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టి.. అంద‌రి కంటే ఎంతో ప్రాధాన్య‌మిచ్చారు! ఎంత‌మంది వ్య‌తిరేకించినా.. అవేమీ పట్టించుకోకుండా అంద‌ల మెక్కించారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న స‌ల‌హాలు విజ‌యానికి ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయ‌ని ఊహల్లో తేలియాడారు. కానీ ఇప్పుడు అవ‌న్నీ నీళ్ల‌పాలు అయిపోయాయి. ఏరికోరి తెచ్చుకున్న వ్యూహ‌క‌ర్త‌ పీకే దెబ్బ‌.. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌కు గ‌ట్టిగా త‌గిలింది. ఈ నేప‌థ్యంలో పీకేకి తొలుత ఇచ్చిన ప్రాధాన్యం ఇస్తారా లేక ప‌క్క‌న‌పెడ‌తారా అనే చ‌ర్చ ఇప్పుడు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో మొద‌లైంది.

2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇందుకోసం వ్యూహ‌క‌ర్తగా పేరున్న ప్ర‌శాంత్ కిషోర్‌ను ఏరికోరి స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. పార్టీ ప్లీన‌రీలో ఆయ‌న్ను కార్య‌క‌ర్త‌ల‌కు ప‌రిచయం చేశారు. ఇది అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే! అప్ప‌టినుంచి వైసీపీలోని కొన్ని వ‌ర్గాలు వ్య‌తిరే కిస్తూనే ఉన్నాయి. అయినా వీటిని ప‌ట్టించుకోలేదు జ‌గ‌న్‌! ఆయ‌న పార్టీ స‌ల‌హాదారుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నంద్యాల ఉప ఎన్నిక జ‌రిగింది. అయితే ఇందులో ఆయ‌న అనుస‌రించిన‌ వ్యూహాలు ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేద‌ని.. ఫ‌లితాన్ని తేలిపోయింద‌నే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం ఖ‌రారైంది. జగ‌న్‌.. త‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా.. పీకేను నియ‌మించుకున్న త‌ర్వాత నంద్యాల ఉప ఎన్నిక‌లు ఆయ‌న‌కు స‌వాల్ లాంటివి. 2019 ఎన్నిక‌ల‌కు ఇవి రిఫ‌రెండం అని జ‌గ‌న్ ప‌దేప‌దే చెప్ప‌డం.. వీటిని ఎంత ప్ర‌తిష్టంగా తీసుకున్నారో తెలుస్తుంది. వైసీపీని విజయానికి చేర్చ‌డంలో రాజ‌కీయ స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌భావం ఏమాత్రం లేద‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. దాదాపు 15 రోజులు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ నంద్యాల‌లోనే మ‌కాం వేశారు. అభ్య‌ర్థి శిల్పా మోహ‌న‌రెడ్డి త‌ర‌ఫున ఇంటింటికీ వెళ్లి ప్ర‌చారం చేశారు. పార్టీ శ్రేణులు కూడా ఎంతో కష్ట‌ప‌డ్డాయి, తీవ్రంగా శ్ర‌మించాయి. కానీ విజ‌యం మాత్రం అధికార పార్టీని వ‌రించింది.

పీకే వ్యూహాలు నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప‌నిచేయ‌డం లేద‌నే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది. జ‌గన్ చాలా కష్టపడ్డారు….పార్టీ కూడా బాగా పనిచేసింది. కాపులు, బీసీలు, ముస్లిం లు, వైశ్యులు..ఇలా అన్ని వర్గాలు ఉండడం తో ఎన్నిక మరింత ఆసక్తి గా మారింది. అయితే ఇన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా చేయ‌డంలో.. పీకే వ్యూహాలు బెడిసికొట్టాయి.

ప్ర‌స్తుతం ఈ ఓట‌మి జ‌గ‌న్ కంటే పీకేకి ఎదురుదెబ్బగా విశ్లేష‌కులు భావిస్తున్నారు. పీకే తొలి దెబ్బే ఇలా ఉంటే.. రానున్న కాలంలో పీకే వ్యూహాల‌ను జ‌గ‌న్ అమ‌లుచేస్తారా? అనే ప్ర‌శ్న ఇప్పుడు మొద‌ల‌వుతోంది. ఎంతో ప్రాధాన్య‌మిచ్చి ప‌క్క‌న పెట్టుకున్న పీకేకి.. అంతే ప్రాధాన్య‌మిస్తారా లేక త‌గ్గిస్తారా అనేది కీల‌కంగా మారింది.