నంద్యాల‌లో వైసీపీకి షాక్‌…. టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్‌

నంద్యాల ఉప ఎన్నిక వేళ అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ ఎత్తులు, పై ఎత్తుల‌తో హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో దూసుకుపోతోన్న ఈ రెండు పార్టీలు ఈ రోజు పెద్ద సంచ‌ల‌నానికి తెర‌లేపాయి. ముందుగా టీడీపీ వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు ఓ ప్లాన్ వేసింది. ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తోన్న శిల్పా మోహ‌న్‌రెడ్డి నామినేష‌న్ చెల్ల‌దంటూ ఓ కొత్త వాద‌న తెర‌మీద‌కు తెచ్చారు.

టీడీపీ లీగ‌ల్ సెల్ వాళ్లు శిల్పా నామినేష‌న్ నోటరీ చేసిన రామ తులసిరెడ్డి నోట‌రీ లైసెన్స్ 2013లోనే ముగిసింద‌ని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆయ‌నే శిల్పా నామినేష‌న్‌పై సంత‌కాలు పెట్టారు. అందువల్ల శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదని టీడీపీ వాదిస్తోంది. టీడీపీ అభ్యంతరాలపై రెండు గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ అధికారులు శిల్పా మోహన్ రెడ్డిని కోరారు.

టీడీపీ ఎత్తుకు పై ఎత్తుతో వైసీపీ చెక్‌:

టీడీపీ ఈ ఎత్తు వేసి వైసీపీ అభ్య‌ర్థిని ఇరుకున పెట్టిన కొద్ది సేప‌టికే వైసీపీ కూడా టీడీపీపై పెద్ద బాంబు వేసింది. నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ పై కూడా వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. భూమా బ్రహ్మానందరెడ్డి ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేయలేదని వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

బ్ర‌హ్మానంద‌రెడ్డి ఆదాయాపు ప‌న్ను కూడా క‌ట్ట‌లేద‌ని వైసీపీ ఆరోపణ‌లు చేయ‌డంతో పాటు ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బ్ర‌హ్మానంద‌రెడ్డి నామినేష‌న్ కూడా తిర‌స్క‌రించాల‌ని పేర్కొంది. దీంతో ముందుగా టీడీపీ వైసీపీకి షాక్ ఇస్తే ఆ వెంట‌నే వైసీపీ కూడా టీడీపీకి దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చింది. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల్లో రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మరి ఈసీ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.