2019 క్లారిటీ: ఎన్టీఆర్‌+ప‌వ‌న్‌+లోకేశ్ ఒక‌వైపు జ‌గ‌న్ ఒక వైపు

2019 ఎన్నిక‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లోను హీటెక్కిస్తున్నాయి. ఈ హీట్ తెలంగాణ‌లో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంది. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. నేడు మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న‌వాళ్లు ఎన్నిక‌ల వేళ శ‌త్రువులు అవుతార‌న్న ఊహాగానాలు కూడా మొద‌ల‌య్యాయి. ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ+టీడీపీ పొత్తు బ్రేక‌ప్ అవుతుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో బుధవారం ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

లోకేశ్ బుధ‌వారం అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో త‌న‌కు విబేధాల్లేవ‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ కోసం ప‌నిచేసేందుకు ఎవ‌రు ముందుకు వ‌చ్చినా తాము ఆహ్వానిస్తామ‌ని లోకేశ్ తెలిపారు. వాస్త‌వంగా ఏపీ టీడీపీకి ఫ్యూచ‌ర్ లీడ‌ర్ ఎవ‌రు అన్న‌దానిపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్‌కు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల‌లో ఎవ‌రు టీడీపీకి స‌రైన వార‌సులు అన్న అంశంపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా పార్టీ ప‌రంగా లోకేశ్‌కు స‌పోర్ట్ చేస్తోన్న వారు కొంద‌రు ఉంటే, నంద‌మూరి అభిమానుల్లో చాలా మంది ఎన్టీఆర్‌కు స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు, బాల‌య్య‌, లోకేశ్‌తో హ‌రికృష్ణ‌కు, ఎన్టీఆర్‌కు గ్యాప్ ఉంద‌న్న‌ది కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక తాజాగా లోకేశ్ త‌న‌కు ఎన్టీఆర్‌తో విబేధాల్లేవ‌ని చెప్ప‌డంతో ఎన్టీఆర్‌ను తిరిగి ద‌గ్గ‌ర‌కు తీసుకునే ప్ర‌క్రియ స్టార్ట్ అయిన‌ట్టు కూడా తెలుస్తోంది.

మూడు నెల‌లుగా ఎన్టీఆర్ మిగిలిన వార‌సులు బాల‌య్య‌-హ‌రికృష్ణ‌ను ఒక్క‌టి చేసేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేసి వీరిని ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది. ఇక తాజాగా లోకేశ్ చేసిన ప్ర‌క‌ట‌నను బ‌ట్టి చూస్తే 2019 ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ టీడీపీ త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

ప్ర‌స్తుతం టీడీపీ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌, గ్రూపు రాజ‌కీయాల‌కు తోడుగా బీజేపీ దూర‌మైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌న్న చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలో టీడీపీ ప‌వ‌న్‌ను ద‌గ్గ‌ర చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది. అటు జ‌న‌సేన‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డంతో పాటు ఇటు ఎన్టీఆర్ ఆ పార్టీకి ప్ర‌చారం చేస్తే అది టీడీపీకి ఎంతైనా ప్ల‌స్ అవుతుంది.

జ‌గ‌న్‌కు గ‌ట్టి స‌వాలే…!

2019లో టీడీపీకి లోకేశ్‌, చంద్ర‌బాబు, బాల‌య్య‌కు తోడుగా ఎన్టీఆర్‌, ప‌వ‌న్ తోడైతే అటు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు వీరిని ఎదుర్కొని అధికారంలోకి రావ‌డం మాత్రం పెద్ద స‌వాల్‌గానే ఉంటుంది. టీడీపీకి వీరంతా క‌లిసినా బీజేపీ జ‌గ‌న్ క‌లిస్తే పోరు ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే బీజేపీ కూడా టీడీపీతోనే ఉంటే జ‌గ‌న్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు.