టీడీపీలో నాడు హీరో  – నేడు జీరో

నేటి రాజ‌కీయ నేత‌ల‌కు ముఖ్యంగా చంగు చంగున గెంతులేసుకుంటూ అవ‌స‌రానికి త‌మ ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి జంపింగులు చేసే జిలానీల‌కు కొత్తప‌ల్లి సుబ్బారాయుడు ఓ లెస్స‌న్‌లాగా క‌నిపిస్తున్నారు!! పార్టీ మార‌డం త‌ప్పుకాక‌పోవ‌చ్చేమో కానీ.. పార్టీల‌ను మార్చ‌డమే త‌ప్పు.. అనే నీతి సుబ్బారాయుడు పొలిటిక‌ల్ హిస్ట‌రీ నేర్పుతున్న స‌రికొత్త లెస్స‌న్‌. అవ‌స‌రాలు, వ్యాపార సామ్రాజ్యాల విస్త‌ర‌ణే ల‌క్ష్యంగా ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును కాల‌దోసి.. పార్టీ కండువాల‌ను కుడి భుజం మీద ఒక‌టి.. ఎడం భుజం మీదొక‌టి ఇష్టానుసారంగా మార్చేసి.. చివ‌రికి అన్నింటికీ చెడిన నేత‌గా అందునా పొలిటిక‌ల్ ప‌స ఎక్కువ‌గా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన నేత‌గా భ్ర‌ష్టు ప‌ట్టిపోయారు కొత్త‌ప‌ల్లి!! ఈయ‌న జీవితం నిజంగా పొలిటిక‌ల్ జంపింగ్‌ల‌కు పెద్ద‌బాల శిక్షే!!

విష‌యంలోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ పొలిటిక‌ల్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పేరు చెబితే కొత్త పల్లి పేరే విన్పించేది. నర్సాపురం నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా గెలుపొందారు. అన్న‌గారి ప్ర‌భంజనం సాగుతున్న‌స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని ఓన‌మాలు నేర్చుకున్న కొత్త‌ప‌ల్లి.. త‌ర్వాత త‌న పొలిటిక‌ల్ విశ్వ‌రూపం చూపించాల‌ని ఎంత‌గానో తాప‌త్ర‌య ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు పార్టీల‌ను కాదు, త‌న‌ను బ‌ట్టే న‌డుస్తార‌ని అతిగాపోయి.. కొంప కొల్లేరు చందంగా త‌న భ‌విష్య‌త్తును తానే కాల‌రాసుకున్నారు.

2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భంజ‌నంతో ఏపీలో అధికార ప‌గ్గాలు కాంగ్రెస్‌కు చేరిపోయాయి. దీంతో టీడీపీ విప‌క్షానికే ప‌రిమిత‌మైంది. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీలో ప‌ద‌వులు అనుభ‌వించిన కొత్త‌ప‌ల్లి.. ఒక్క‌సారిగా పార్టీ మారే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి ప్ర‌జారాజ్యం రావ‌డంతో దానిలోకి కొత్త‌ప‌ల్లి జంప్ చేయ‌డం చాలా తేలిక‌గా జ‌రిగిపోయింది. ఇదే.. ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్‌కు పెద్ద బ్యాక్ డ్రాప్ అవుతుంద‌ని ఆయ‌న ఆనాడు ఊహించ‌లేదు. చిరంజీవిని నమ్ముకుని ప్రజారాజ్యంలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ కండువాను కప్పుకోవాల్సి వచ్చింది.

2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రాష్ట్ర విభజన జరగడంతో అందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. ఈ సారి జగన్ పార్టీని నమ్ముకున్నారు. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత అధికారంలో లేని వైసీపీలో ఉండలేక తనకు రాజకీయ బిక్ష పెట్టిన టీడీపీలో తిరిగి చేరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల్లో చేరి వచ్చిన కొత్తపల్లికి ఇప్పుడు టీడీపీలో కూడా విలువ లేకుండా పోయింది. ఆయన్ను పట్టించుకునే వారే లేరు. కనీసం ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా ఆయన వైపు చూడటం లేదు.

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు ఏమిటి క‌ర్త‌వ్యం?! రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌డ‌మా? జ‌న‌సేన‌లో చేర‌డ‌మా? రెండే ఆప్ష‌న్లు ఇప్పుడు కొత్త‌ప‌ల్లికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న రెండోదే ఎంచుకున్న‌ట్టు ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. సో.. పొలిటికల్ లీడర్లూ….కొత్తపల్లిని చూసైనా… పార్టీలు మారేటప్పుడు కొంత ఆలోచన చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉందేమో చూడండి.