ఆ మైలేజీ స్ట్రాటజీ జ‌గ‌న్‌కే పెద్ద దెబ్బ!

మ‌నిష‌న్నాక ఒక‌టి రెండు త‌ప్పులు స‌హ‌జం. ఇక‌, రాజ‌కీయ నేత‌న్నాక‌.. మ‌రో నాలుగు త‌ప్పులు స‌హ‌జం. కానీ, వైసీపీ అధినేత జ‌గ‌న్ ను చూస్తుంటే మాత్రం ప‌దే ప‌దే అదే త‌ప్పుల‌తో ఆయ‌న త‌న ఇమేజ్‌నే కాకుండా పార్టీ ఇమేజ్‌ను కూడా తీవ్ర‌స్థాయిలో త‌గ్గించేసుకుంటున్నారు. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక‌ల విష‌యంలో ఆయ‌న అనుస‌రిస్తున్న వైఖ‌రి… చేస్తున్న కామెంట్లు.. సొంత పార్టీ నేత‌ల‌కే న‌చ్చ‌డం లేదంటే.. జ‌గ‌న్ వైఖ‌రి ఎలా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవ‌చ్చు. సాధార‌ణంగా అధికార పార్టీ నేత‌ల‌ను విప‌క్షం విమ‌ర్శించ‌డం స‌హ‌జం. అలా విమ‌ర్శించ‌క‌పోతేనే మ‌నం అనుమానించాలి కూడా. అయితే, ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్ విష‌యానికి వ‌చ్చే స‌రికి ఈ విమ‌ర్శ‌లు హ‌ద్దు మీరుతున్నాయి.

నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత మాట అనేయ‌డం ఇప్పుడు జ‌గ‌న్‌కు అల‌వాటుగా మారిపోయింది. పోనీ ఆ విమ‌ర్శ‌లు హేతుబ‌ద్ధంగా ఏమ‌న్నా ఉన్నాయా? అంటే అదిలేదు. కేవ‌లం ఏదో మాట‌ల‌నేయ‌డం అన్న‌ట్టుగానే క‌నిపిస్తోంది. అధికార ప‌క్షం టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు పొలిటిక‌ల్ కెరీర్ అంద‌రికీ తెలిసిందే. దాదాపు 40 ఏళ్లుగా ఆయ‌న జ‌గ‌న్ తండ్రి వైఎస్‌తో స‌మానంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. గ‌తంలో తొమ్మి దేళ్లు సీఎంగా ఉన్నారు. ప్ర‌స్తుతం రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. అంత‌కు ముందు కూడా కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నారు. ఇలా ఎలా చూసినా.. రాష్ట్రంలో సీనియ‌ర్ మోస్ట్ నేత‌ల్లో బాబు ఒక‌రు. ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. పొలిటిక‌ల్‌గా ఆయ‌న అరంగేంట్రం 2009 ఎన్నిక‌ల‌తోనే అది కూడా తండ్రి చాటు బిడ్డ‌మాదిరిగా ఆయ‌న క‌డ‌ప నుంచి ఎంపీగా గెలిచారు.

ఆ త‌ర్వాత వైఎస్ మ‌ర‌ణం, అనంత‌రం కాంగ్రెస్‌తో విభేదాలు ఇలా అనేక ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ పార్టీపెట్టుకున్నారు. అంతేత‌ప్ప ఆయ‌న కు రాష్ట్రాన్ని పాలించిన అనుభవం ఎంత మాత్ర‌మూలేదు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబుపై ఒంటికాలిపై లేస్తుండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్యంగా నంద్యాల ఉప పోరు ప్ర‌చారంలో జ‌గ‌న్‌.. బాబు నామ‌స్మ‌ర‌ణ చేయ‌కుండా గ‌డ‌ప‌లేక‌పోతున్నాడు. అడ్డ‌మైన మాట‌ల‌తో బాబును తిట్ట‌డ‌మే మైలేజీకి ప్ర‌ధాన సూత్రం అని భావించాడో ఏమో తెలీదు కానీ.. అయిన కాడికి నోరు పారేసుకుంటున్నారు. అయితే, ఇలా చేస్తున్న ఏ ఒక్క విమ‌ర్శ‌నూ జ‌గ‌న్ నిరూపించే ప్ర‌య‌త్నం మాత్రం చేయ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. రాజ‌ధాని లేద‌న్నాడు. పోల‌వ‌రం ఆగిపోతుంద‌న్నాడు. డ్వాక్రా రుణాల మాఫీ లేద‌న్నాడు. రైతులు అష్ట క‌ష్టాలు ప‌డుతున్నార‌ని విమ‌ర్శించాడు.

ఈ క్ర‌మంలోనే బాబు పై మాట‌ల యుద్ధం చేస్తున్నాడు. అయితే, జ‌గ‌న్ చేసిన ఏ ఒక్క విమ‌ర్శ‌నూ అటు ఆయ‌న కానీ, ఇటు ఆయ‌న పార్టీ ప‌రివారం కానీ నిరూపించ‌లేక‌పోతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఏవ గింపు వ‌చ్చింది. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ త‌న పార్టీ గురించి ఎక్క‌డా పెద్ద గా ప్ర‌చారం చేస్తున్న దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. గ‌త మూడేళ్ల‌తో తాము సాగించిన పోరాటాలు, సాధించిన ప‌నులు .. ఇలా ఆయ‌న ఓ జాబితా విడుద‌ల చేస్తే బాగుంటుంది క‌దా.. అనే వారూ ఇప్పుడు క‌నిపిస్తున్నారు. అయితే, ఆయ‌న త‌న పార్టీ గురించి మానేసి.. బాబును విమ‌ర్శించ‌డంపైనే దృష్టి పెట్టారు. ఇది నిజంగా ఇప్పుడు జ‌గ‌న్‌కే పెద్ద దెబ్బ వేస్తుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.