నంద్యాల‌లో టీడీపీకి వైసీపీ గ‌ట్టిపోటీ! 

నంద్యాల ఉప ఎన్నిక‌లకు సంబంధించి నోటిఫికేష‌న్ ఇంకా విడుద‌ల కాక‌ముందే అధికార పార్టీ టీడీపీ ఎన్నిక‌ల వేడిని అమాంతం పెంచేసింది. సాక్షాత్తూ.. చంద్ర‌బాబే నేరుగా నంద్యాల‌లో ఇప్ప‌టికి రెండు సార్లు ప‌ర్య‌టించారు. రాత్రు ళ్లు కూడా ఆయ‌న అక్క‌డే మ‌కాం వేస్తూ.. ఎలాగైనా గెలిచి తీరాల‌ని ప‌ట్టుబట్టారు. మ‌రి అధికార ప‌క్షం ఇంత‌చేస్తే.. అస‌లు ఈ సీటు నుంచి 2014లో గెలుపొందిన వైసీపీ ఊరుకుంటుందా? జ‌గ‌న్ అస‌లు ఊరుకుంటాడా? మ‌ళ్లీ తామే ఈ సీటు నుంచి గెలిచి బాబు పాల‌న‌లో ఏమీ లేద‌ని చాటి చెప్పాల‌ని డిసైడ్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే త‌మ ఎన్నిక‌ల స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన విధంగా పావులు క‌దుపుతున్నాడు.

నంద్యాల నియోజకవర్గానికి ప‌ర్య‌వేక్ష‌కులుగా ఇప్పటికే సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణరావులను జ‌గ‌న్ నియ‌మించాడు. తాజాగా ప్రతి వార్డుకు ఒక ఇన్ ఛార్జిని నియమించాడు. నంద్యాల పట్టణంలో మొత్తం 42 వార్డులున్నాయి. 42 వార్డుల్లో ఒక్కొక్క వార్డుకు ఇద్దరేసి చొప్పున ఇన్ ఛార్జులను పెట్టారు. అంటే 84 మంది వైసీపీ నేతలు ఒక్క నంద్యాల పట్టణంలోనే మాకాం వేశార‌న్న‌మాట‌. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు కాగా, మరికొందరు రాయలసీమ జిల్లాలకు చెందిన నియోజకవర్గ ఇన్ ఛార్జులు. కేవలం ప్రచారమే కాకుండా వీరంతా వార్డు వారీగా ప్రతి ఓటరును కలిసి వైసీపీకి మద్దతివ్వాలని కోరనున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత నంద్యాల టౌన్ లో ఎక్కువగా కన్పిస్తుండటంతో ఓటర్లు జారిపోకుండా తమ వైపునకు తిప్పుకునేందుకు వైసీపీ నేత‌లు ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 8గంటల కల్లా వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని కలిసి ఆరోజు జరిగే ప్రచారంతో పాటు, ఆ వార్డులో ఏం చేయాలి? ఏం హామీలివ్వాలి? వ్యక్తిగత ప్రయోజనాలతో పాటుగా సామూహిక సమస్యల వంటి వాటిని శిల్పా తో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తూ ప్రజాసమస్యలతో పాటు వారి అవసరాలను కూడా గుర్తించడంతో వాటిపై వైసీపీ దృష్టి పెట్టినట్లుతెలుస్తోంది. సో.. ఎలాగైనా ఈ సీటును తిరిగి తామే ద‌క్కించుకోవాల‌ని జ‌గ‌న్ మంచి క‌సిమీద ఉండ‌డం గ‌మ‌నార్హం.