మ‌రీ ఇంత అత్యుత్సాహ‌మేంటి జ‌గ‌న్‌!

ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్ మ‌రోసారి అత్యుత్సాహం ప్ర‌దర్శించారు. ప్ర‌ధాని మోడీని ఢిల్లీలో క‌లిసిన నాటి నుంచి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిపై విమర్శ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిని ప‌ట్టించుకోకుండా తాను ప‌ట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటూ ఆయ‌న మొండిగా ముందుకు వెళుతున్నారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన నాటి నుంచి ఇది మ‌రింత ఎక్క‌వైంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఎన్డీఏ అభ్య‌ర్థి రామ‌నాథ్ కోవింద్‌ను జ‌గ‌న్ ఏపీలో కాకుండా తెలంగాణ‌లో క‌ల‌వ‌డం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. విభ‌జ‌న జ‌రిగి మూడేళ్ల‌యినా ఇంకా హైద‌రాబా ద్‌ను వీడి రాకుండా ఇలాంటి ప‌నులు చేయ‌డం పార్టీకి మైన‌స్‌గా మారుతుంద‌ని నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

విభ‌జ‌న అనంత‌రం.. ఏపీకి సంబంధించిన‌ కార్యాల‌యాలు, ఉద్యోగుల‌ను ఆగ‌మేఘాల‌పై త‌ర‌లించేశారు సీఎం చంద్ర‌బాబు! ఇక రాజ‌కీయ పార్టీలు కూడా ఏపీలో కార్యాల‌యాల కోసం వెతుకులాట ప్రారంభించాయి. ఇక ప‌రిపాల‌న అంతా సొంత రాష్ట్రం నుంచే జ‌రుగుతున్నా.. ప్ర‌తిప‌క్ష నేత మాత్రం హైద‌రాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. ఏపీ నేత‌ల‌తో భేటీ కావాల‌న్నా.. వారు హుటాహుటిన హైద‌రాబాద్‌కు వెళ్లాల్సిందే! దీనిపై ఆ పార్టీ నేత‌లే మండిప‌డు తున్నారు. ప్ర‌జ‌ల్లోనూ ఇదే అభిప్రాయం క్ర‌మ‌క్ర‌మంగా వ్య‌క్త‌మ‌వుతోంది. సెంటిమెంట్‌ను గుర్తించయినా ఏపీకి రావాల‌ని నేత‌లు మొత్తుకుంటున్నా జ‌గ‌న్ మాత్రం స‌సేమిరా అంటున్నారు.

ప్ర‌స్తుతం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్ తో భేటీ కూడా హైదరాబాద్ లోనే జరగడం వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. తన అభ్యర్ధిత్వాన్ని బలపర్చాలంటూ ఆయ‌న‌ తెలంగాణకు వచ్చారు. తెలంగాణలోని టీటీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. వీరితో పాటుగా జ‌గ‌న్ స‌హా వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా పార్క్ హయత్ హోటల్ లో రామ్ నాథ్ భేటీ అయ్యారు. వాస్తవానికి కోవింద్ తెలంగాణ పర్యటన ముగించుకుని మధ్యాహ్యా నికి విజయవాడ చేరుకుంటారు. అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. కానీ వైసీపీ నేత‌ల అత్యుత్యాహం ఇప్పుడు విమర్శ‌ల‌కు తావిస్తోంది.

హైదరాబాద్ ను వదిలి రావడం లేదని, ఏపీకి చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారనే విమ‌ర్శ‌లు జ‌గ‌న్‌పై ఉన్నాయి. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉందని జగన్ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ…ఏపీ ప్రజల సెంటిమెంట్ ను జగన్ పరిగణనలోకి తీసుకోలేదన్నది మరోసారి స్పష్టమైంది. రాష్ట్రపతి అభ్య‌ర్థిని జగన్ సొంత గడ్డమీద కలవకుండా పరాయి రాష్ట్రంలో కలవడాన్ని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ రప్పించడమేంటంటున్నారు. మొత్తం మీద జగన్ మాత్రం ఎన్ని విమర్శలు విన్పిస్తున్నా తాను మాత్రం మార‌డం లేదు. ఇలాగే కొనసాగితే జగన్ పార్టీకి కష్టాలు తప్పవని హెచ్చ‌రిస్తున్నారు.