న‌ల్గొండ జిల్లాలో ఆ రెండు సీట్లలో టీఆర్ఎస్‌కు ఓట‌మేనా..!

తెలంగాణ‌లోని పాత న‌ల్గొండ జిల్లా పేరు చెపితే కాంగ్రెస్‌కు కంచుకోట‌. చంద్ర‌బాబు సీఎంగా గెలిచిన‌ప్పుడు కూడా ఈ జిల్లాలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. ఇక ప్ర‌స్తుతం అధికార టీఆర్ఎస్ తిరుగులేని విజ‌యాలు సాధిస్తున్నా కాంగ్రెస్ మాత్రం ఇక్క‌డ ఎమ్మెల్సీ సీటు గెలుచుకుని ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. ప్ర‌స్తుతం ఈ జిల్లాలోనే టీ కాంగ్రెస్‌కు ఉద్దండులైన నాయ‌కులు అంద‌రూ ఉన్నారు.

న‌ల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, నాగార్జునా సాగ‌ర్ నుంచి జానారెడ్డి, హుజూర్‌న‌గ‌ర్ నుంచి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఉత్త‌మ్ భార్య ప‌ద్మావ‌తి త‌దిత‌రులంతా అసెంబ్లీకి ప్రాధినిత్యం వ‌హిస్తున్నారు. ఈ జిల్లాలోని నల్గొండ ఎంపీ సీటును కూడా గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్క‌డ నుంచి భారీ మెజార్టీతో ఎంపిగా గెలిచిన గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోయారు.

ఇదిలా ఉంటే ఈ జిల్లాలో ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ మ‌రింత పుంజుకున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. జిల్లాలో టీఆర్ఎస్ గెలుచుకున్న రెండు సీట్ల‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. సూర్యాపేట నుంచి గెలిచి మంత్రిగా ఉన్న జ‌గ‌దీశ్‌రెడ్డిని నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే అస‌హ్యించుకుంటున్నారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి ఆయ‌న పోటీ చేసే గెలిచే ప‌రిస్థితి లేదన్న టాక్ వ‌చ్చేసింది.

సూర్యాపేట‌లో ఓట‌మి భ‌యంతోనే జ‌గ‌దీశ్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ఎల్బీన‌గ‌ర్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్ న‌డుస్తోంది. ఇక న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం వ్య‌తిరేక‌త‌తోనే కొట్టుమిట్టాడుతున్నార‌ట‌. ఇక ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావ‌ని కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి జోస్యం చెప్ప‌డం విశేషం.