`తూర్పు` వైసీపీలో టికెట్ల లొల్లి షురూ!! 

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్‌సీపీలో గ్రూపు రాజ‌కీయాల‌కు, అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు కొద‌వ‌లేదు. ఇవి నిత్యం ర‌గులుతూనే ఉన్నాయి. గోదావ‌రి జిల్లాల్లో ఎలాగైనా ఈసారి ఎక్కువ సీట్లు సాధించాల‌ని వైసీపీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ముఖ్యంగా ప‌శ్చిమ కంటే తూర్పు గోదావ‌రిలో కొంత బ‌లం ఉన్న విష‌యం తెలిసిందే! అందుకే మ‌రింత బ‌ల‌ప‌డేం దుకు ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో నియోజక‌వ‌ర్గ ఇన్‌చార్జులు, కో-ఆర్డినేటర్లు ఇలా.. ఒక‌రికంటే ఎక్కువ‌మందిని నియ‌మించేశారు. ఇవే ఇప్పుడు ఆయ‌న‌కు త‌ల‌నొప్పి తీసుకొస్తున్నాయి. వాళ్లంతా త‌మ‌కేటికెట్ ద‌క్కుతుంద‌ని.. తమ సొంత కేట‌రీని త‌యారుచేసుకునే ప‌డ్డారు. దీంతో ఒకే సీటు కోసం క‌నీసం ఇద్ద‌రు పోటీ ప‌డే అవ‌కాశాలున్నాయి.

2019 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల కంటే త‌క్కువ స‌మ‌యం ఉండ‌టంతో వైసీపీలో సీట్ల గోల మొద‌లైంది. ఎమ్మెల్యే టికెట్ తమ‌కంటే త‌మ‌కు అని ఇప్ప‌టి నుంచే ఎవ‌రికి వారు ధీమా వ్య‌క్తంచేస్తున్నారు. త‌మ సొంత వ‌ర్గాన్ని కూడా త‌యారు చేసుకుంటున్నారు. అలాగే ఆధిప‌త్యం కోసం అప్పుడే పావులు క‌దిపేస్తున్నారు. తూర్పు గోదావరి వైసీపీ రాజకీయాలను చూస్తే అలానే అనిపిస్తోంది. పార్టీని బలోపేతం చేయడానికి నియమించిన నియోజకవర్గ ఇన్ ఛార్జులు, కో -ఆర్డినేటర్లు ఇద్దరు ముగ్గురవ్వడంతో అందరూ సీటు పై ఆశలు పెంచుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు, మూడు పార్లమెంటు స్థానాలున్నాయి. వీటిలో ఆరు నియోజకవర్గాల్లో ఇద్దరేసి ఇన్ ఛార్జిలను నియ మించారు.

పార్టీని పటిష్టం చేయడం కోసం ప‌నిచేయ‌కుండా గ్రూపులను తయారు చేసుకుంటూ తమ రాజకీయ భవిష్యత్తు కోసమే ఆరాటపడుతున్నారు. పార్టీలో ఉన్న సీనియర్ నేతలను కాదని నిన్నగాక మొన్న వైసీపీలోకి వచ్చిన కురసాల కన్నబాబును జిల్లా ఇన్ ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో సీనియర్ నేతలైన కుడుపూడి చిట్టబ్బాయి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ జడ్పీ ఛైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాల్ లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కాకినాడలో ముత్తా గోపాలకృష్ణ తనయుడు ముత్తా శశిధర్ ను ఇన్ ఛార్జిగా నియమించారు. తర్వాత మూడేళ్ల పాటు పత్తా లేకుండా పోయిన ద్వారంపూడ చంద్రశేఖర్ రెడ్డిని అదే కాకినాడకు కో-ఆర్డినేటర్ గా నియమించారు.

దీంతో ముత్తా శశిధర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసిన చలమల శెట్టి సునీల్ కూడా పార్టీ నిర్ణయాల పట్ల అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. మండపేటలోనూ పట్టాభిరామయ్య చౌదరి, లీలా కృష్ణలను ఇన్ ఛార్జిలుగా నియమించారు. రాజోలులో బొంతు రాజేశ్వరరావు, కృష్ణంరాజు, రాజమండ్రి రూరల్ లో ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, రంపచోడవరంలో ఎమ్మెల్యే పంతం రాజేశ్వరి, అనంత ఉదయభాస్కర్, పి. గన్నవరంలో చిట్టిబాబును కాదని పాముల రాజేశ్వరిని, రాజోలుకు రాపాక వరప్రసాద్ ను, పెద్దాపురానికి తోట నాయుడిని కాదని అత్తిలి సీతారామస్వామిని, పిఠాపురం నియోజకవర్గానికి పెండం దొరబాబును కాదని వంగా గీతను తీసుకొచ్చే ప్రయత్నాలు జరగుతున్నాయి. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి.