సబితా ఇంద్రారెడ్డి ప్లాన్…హైకమాండ్ ఒప్పుకుంటుందా ?

మాజీ హోం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి రాజ‌కీయంగా పెద్ద యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో మ‌హేశ్వ‌రం నుంచి పోటీ చేసి ఓడిపోయిన స‌బితా టీ కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నాయ‌కుల దూకుడు ముందు పెద్ద‌గా ప్ర‌చారంలోకి రావ‌డం లేదు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతోన్న ఆమె ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్టు టీ కాంగ్రెస్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. 2009 ఎన్నిక‌ల్లో మ‌హేశ్వ‌రం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హోం మంత్రి అయిన స‌బితా ఇంద్రారెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి తీగ‌ల కృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో స‌బిత వార‌సుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ త‌ల్లి కొడుకులు మ‌రోసారి పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఈ సారి మాత్రం ఇద్ద‌రూ అసెంబ్లీకే పోటీ చేస్తామ‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. స‌బితా ఇంద్రారెడ్డి ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే టీ కాంగ్రెస్ పెద్ద‌ల‌కు కూడా చెప్పేశార‌ట‌. త‌న త‌న‌యుడు ఎంపీగా ఉండ‌డం కంటే ఎమ్మెల్యేగా ఉంటేనే స్టేట్ పాలిటిక్స్‌లోను, జిల్లాలోను చ‌క్రం తిప్పేందుకు బాగుంటుంద‌ని ఆమె భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే స‌బితా మ‌హేశ్వ‌రం నుంచి మ‌రోసారి బ‌రిలోకి దిగ‌నున్నారు. త‌న త‌న‌యుడు కార్తీక్‌కు రంగారెడ్డి, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఏదో ఒక అనువైన నియోజ‌క‌వ‌ర్గం కోసం ఆమె వెతుకులాట ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభజ‌న జ‌రిగితే కార్తీక్‌కు చాలా ఆప్ష‌న్లు ఉంటాయి. లేని ప‌క్షంలో మేడ్చ‌ల్‌, రాజేంద‌ర్‌న‌గ‌ర్, శేరిలింగంప‌ల్లి లాంటి నియోజ‌క‌వ‌ర్గాలు త‌న కుమారుడి పోటీకి ఎలా ఉంటాయ‌ని ఆమె ఆలోచిస్తున్నార‌ట‌.

ఇక వీరిద్ద‌రు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు హై క‌మాండ్ ఎంత వ‌ర‌కు ఒప్పుకుంటుందా ? అన్న‌ది సందేహ‌మే. మ‌రో ట్విస్ట్ ఏంటంటే గ‌త ఎన్నిక‌ల్లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు అక్క‌డ ఆ సీటును డీకే అరుణ త‌న భ‌ర్త‌కు ఇప్పించుకోవాల‌ని చూస్తున్నారు. అదే జ‌రిగితే జైపాల్ తిరిగి చేవెళ్ల‌కు రావాల్సి ఉంటుంది. అప్పుడు కార్తీక్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు త‌ప్ప వేరే ఆప్ష‌న్ లేదు.