నిన్న త‌మ్ముడు.. నేడు అన్న వైసీపీలోకి జంప్‌

అన్న బాట‌లో త‌మ్ముడు న‌డ‌వ‌డం స‌హ‌జం! కానీ ఇక్క‌డ త‌మ్ముడి బాట‌లో అన్న న‌డుతుస్తున్నారు. ముందు నుంచి అనుకున్న‌దే అయినా.. కాస్త అటు ఇటుగా.. ముందు వెనుక‌గా అన్న‌త‌మ్ముళ్లు ఒక గూటికి చేర‌బోతున్నారు. కర్నూలులో టీడీపీకి మ‌రో దెబ్బ త‌గల‌బోతోంది. ఇప్ప‌టికే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించి తీవ్ర భంగ‌పాటుకు గురై.. వైసీపీలో చేరిపోయారు శిల్పా మోహ‌న్‌రెడ్డి. ఇప్పుడు ఆయ‌న బాట‌లోనే అన్న శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే వార్త‌లు టీడీపీ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి, అయితే వీటిని పార్టీ నేత‌లే ధ్రువీక‌రిస్తుండ‌టం గ‌మనార్హం! ఇక రేపోమాపో ఆయ‌న వైసీపీలోకి జంప్ అయిపోతున్నార‌ట‌.

ఎలాంటి ట్విస్టులు లేవు! ములుపులు అంత‌క‌న్నా లేవు! అంతా ఊహించినట్లే జరుగుతోంది. ముందు తమ్ముడు.. తరువాత అన్న.. టీడీపీకి షాక్‌ల మీద షాకులు ఇస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన శిల్పా సోదరులు ఇప్పుడు ఆ పార్టీ నుంచి వరుసగా బయటకు వెళ్లిపోతున్నారు. నంద్యాల అసెంబ్లీ సీటు విషయంలో పార్టీ అధిష్టానంతో ఘర్షణకు దిగిన ఈ అన్నాదమ్ముళ్లు తమ కోర్కెను కాదన్నారన్న కోపంతో పార్టీని వదిలి వేసి వైకాపాలో చేరిపోతున్నారు. ముందు తమ్ముడు శిల్పామోహన్‌రెడ్డి పార్టీ నుంచి జంప్‌ కాగా ఇప్పుడు అన్న శిల్పా చక్రపాణిరెడ్డి వంతు వచ్చింది.

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ్ముడు శిల్పామోహన్‌రెడ్డి వైకాపా నుంచి పోటీ చేస్తుండగా, టీడీపీ తర‌ఫున‌ భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు పోటీలో ఉన్నారు. తమ్ముడు వైకాపా తర‌ఫున పోటీ చేస్తున్నా తాను టీడీపీకే మద్దతు ఇస్తానని మొన్న.. మొన్నటి దాకా చక్రపాణి చెప్పారు. భూమా నాగిరెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే అప్పుడు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి వారిని శాంతింప‌జేశారు. అయితే మారిన పరిస్థితుల్లో టీడీపీ అగ్రనాయకత్వం ఆయన్ను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచుతోంది. తమ్ముడి గెలుపు కోసం చక్రపాణిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానంతోనే టీడీపీ నేతలు ఆయనను దూరంగా ఉంచుతున్నారు.

ఆయనకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, దూరంగా ఉంచడంతో ఇక పార్టీకి తనపై నమ్మకలేదనే భావనతో ఆయన తమ్ముడు చేరిన పార్టీలో చేరడానికి ముహూర్తాలు చూసుకుంటున్నారట. తనను మండలి ఛైర్మన్‌ చేస్తారనే అభిప్రాయంతో ఉన్న చక్రపాణిరెడ్డి.. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పదవి గురించి అడగలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక టీడీపీలో ఉండడం కన్నా తమ్ముడు వెళ్లిన బాటలోనే వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారట. మొత్తం మీద ఉప ఎన్నికకు ముందే ఆయన వైకాపాలో చేరతారని నంద్యాలలో ప్రచారం జరుగుతోంది. పార్టీ నేత‌లు కూడా ఆయన్ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేసేందుకు వెనుకాడుతున్నార‌ట‌.