నంద్యాల‌లో ప్ర‌జెంట్ ట్రెండ్ ఏంటి?

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ఉప ఎన్నిక రోజు రోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఇక్క‌డ రోజు రోజుకు వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంటే టీడీపీ గ్రాఫ్ త‌గ్గుతోంది. ఇక్కడ అన్ని వ‌ర్గాల ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో 56 వేల ఓట‌ర్లు ఉన్న ముస్లింల‌ను ఆక‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు ఇక్క‌డ ఇద్ద‌రు ముస్లిం వ్యక్తుల‌కు రెండు కీల‌క ప‌ద‌వులు ఇచ్చారు.

కాంగ్రెస్‌లో చేరిన నౌమాన్‌కు కార్పొరేష‌న్ ప‌ద‌వితో పాటు ఫ‌రూఖ్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. మైనార్టీల‌ను ఆక‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు ఇంత చేసినా మ‌రో ముస్లిం నేత వైసీపీలో చేరడం నిజంగా టీడీపీకి షాక్ అనే చెప్పుకోవాలి. ఇక్క‌డ గ‌త వారం రోజుల్లో ముగ్గురు కీల‌క వ్య‌క్తులు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి ముందుగా పార్టీలో చేర‌గా ఆ వెంట‌నే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన రాకేశ్‌రెడ్డితో పాటు ఇప్పుడు తాజాగా నంద్యాల 12వ వార్డు కౌన్సిలర్ హనీఫ్ వైసీపీలో చేరడం టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్‌లాంటిదే.

ముస్లిం వర్గానికి చెందిన హనీఫ్ తన అనుచరులు 300 మందితో కలిసి పార్టీలో చేరారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు సమక్షంలో హనీఫ్ పార్టీలో చేరారు. ఇక్క‌డ చంద్ర‌బాబు అధికార యంత్రాంగాన్ని త‌న గుప్పెట్లో పెట్టుకునేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కీల‌క నేత‌లు మాత్రం వైసీపీ బాట ప‌ట్టేస్తున్నారు.

ఇక వ‌చ్చే నెల 3వ తేదీన వైసీపీ అధినేత జ‌గ‌న్ నంద్యాల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ పూర్త‌యిన త‌ర్వాత విజ‌య‌ల‌క్ష్మి, ష‌ర్మిల కూడా ఇక్క‌డ శిల్పా త‌ర‌పున ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇక జ‌గ‌న్ ప‌ర్య‌టన‌లో మ‌రికొంత మంది కీల‌క నాయ‌కులు వైసీపీలోకి జంప్ చేస్తార‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఓవ‌రాల్‌గా నంద్యాల‌లో వైసీపీ ప్రస్తుతానికి మానసికంగా పైచేయిలో ఉంది. మ‌రి ఫైన‌ల్ ఫ‌లితం ఎలా ఉంటుందో ? చూడాలి.