బీజేపీలోకి చంద్ర‌బాబు అనుచ‌రుడు..!

ఆయ‌న ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్రియ శిష్యుడు. చంద్ర‌బాబు ప్రోత్సాహంతో రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చిన స‌ద‌రు పారిశ్రామిక‌వేత్తకు చంద్ర‌బాబు ఏకంగా మూడుసార్లు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఓ సారి ఎంపీగా కూడా ఆయ‌న గెలిచారు. స‌ద‌రు పారిశ్రామిక‌వేత్త కోసం చంద్ర‌బాబు ఏకంగా టీడీపీలో ఓ సీనియ‌ర్‌ను కూడా వ‌దులుకున్నారు. మ‌రి చంద్ర‌బాబు అంత‌లా ప్ర‌యారిటీ ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు బాబుకు షాక్ ఇచ్చి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారా ? అంటే తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో అవున‌న్న ఆన్స‌రే వినిపిస్తోంది.

ఆయ‌న ఎవ‌రో కాదు ఖ‌మ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌రావు. ఖ‌మ్మం జిల్లాలో టీడీపీ పేరు చెపితే ఒక‌ప్పుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పేరు ఒక్క‌టే విన‌ప‌డేది. ఆ మాట‌కు వ‌స్తే ఆ జిల్లా రాజ‌కీయాలు పేరు చెపితేనే గుర్తుకు వ‌చ్చే క్రేజీ మేన్ తుమ్మ‌ల‌. అలాంటిది మ‌ధుకాన్ సంస్థ‌ల అధినేత‌గా ఉన్న నామా నాగేశ్వ‌ర‌రావును ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చిన చంద్ర‌బాబు ఆయ‌న‌తో తుమ్మ‌ల ఆధిప‌త్యానికి చెక్ పెట్టించాల‌ని తెర వెన‌క ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశార‌న్న టాక్ ఉంది. చంద్ర‌బాబుకు ఎంతో న‌మ్మిన బంటు నామా.

నామా ఎంట్రీతో నామా వ‌ర్సెస్ తుమ్మ‌ల వార్ షురూ కావ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ ఓడిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం సెగ్మెంట్ వ‌ర‌కు టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వ‌ర‌రావుకు 21 వేల మెజార్టీ వ‌స్తే అక్క‌డ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మ‌ల 5 వేల‌తో ఓడిపోయారు. ఓవ‌రాల్‌గా ఇద్ద‌రూ ఓడిపోయారు. ఇందుకు వీరి మ‌ధ్య ఆధిప‌త్య పోరే ప్ర‌ధాన కార‌ణం.

ఎన్నిక‌ల త‌ర్వాత తుమ్మ‌ల టీఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యి ఇప్పుడు ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల‌ను మ‌రోసారి త‌న క‌నుసైగ‌ల‌తో శాసించేస్తున్నారు. ఇక తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారి చివ‌ర‌కు పాతాళానికి ప‌డిపోయింది. ఈ ప‌రిస్థితుల్లో నామా పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఆయ‌న బాబుకు ఎంత న‌మ్మిన‌బంటుగా ఉన్నా ఏపీకి వెళ్లి పోటీ చేసే ఛాన్స్ లేదు. ఈ క్ర‌మంలోనే బీజేపీలోకి వెళ్లి ఖ‌మ్మం జిల్లా వ‌ర‌కు బ‌ల‌మైన నేత‌గా ఎద‌గాల‌ని నామా ప్ర‌యత్నాలు చేస్తున్నార‌ట‌.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ తెలంగాణ‌లో ఒంట‌రిగా పోటీ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలోనే నామా ఖ‌మ్మం లోక్‌సభ సీటు నుంచి ఆ పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే నామా ప్లాన్ ఎలా ఉన్నా చంద్ర‌బాబు ఈ డెసిష‌న్‌కు ఎంత వ‌ర‌కు ఒప్పుకుంటారు ? లేదా నామాకు ఏదైనా ప్ర‌త్యామ్నాయం చూపిస్తారా ? నామా పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.