మ‌ల్లాది విష్ణు వైసీపీ ఎంట్రీ… ఆ ఇద్ద‌రికి ఎర్త్ త‌ప్ప‌దా..!

విజ‌య‌వాడ‌కు చెందిన కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరడం ఖరారైంది. విష్ణు వైసీపీ ఎంట్రీపై గ‌త ప‌ది రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఇటీవ‌ల నాలుగైదు సార్లు వైసీపీలో చేరే అంశంపై జ‌గ‌న్‌తో ఫోన్లో మాట్లాడుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం లోట‌స్‌పాండ్‌లో జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో చేరుతున్న విష‌యాన్ని క‌న్‌ఫార్మ్ చేశారు.

ప‌ది రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని విష్ణు పార్టీ మార‌నున్నారు. ఇదిలా ఉంటే విష్ణు వైసీపీలోకి వ‌స్తూ వ‌స్తూనే ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న ఓ కీల‌క నేత‌కు ఎర్త్ పెట్టేయ‌నున్నారు. ఇప్పటి వ‌ర‌కు విజ‌య‌వాడ న‌గ‌ర వైసీపీ అధ్య‌క్షుడిగా ఉన్న వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌ను ఆ ప‌ద‌వి నుంచి తొలగించి, విష్ణుకు న‌గ‌ర వైసీపీ ప‌గ్గాలు అప్ప‌గించేలా జ‌గ‌న్ ఆయ‌న‌కు హామీ ఇచ్చార‌ట‌.

ఈ మేర‌కు ప్ర‌స్తుతం న‌గ‌ర వైసీపీ అధ్య‌క్షుడిగా ఉన్న వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌ ఆ పదవి నుంచి వైదొలిగేందుకు సంసిద్ధత వ్యక్తంచేసినట్లు తెలిసింది. విష్ణుకు మొదటి నుంచీ వైఎస్‌ రాజశేఖరరెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావ సమయంలోనే ఆయన పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వైసీపీలో చేరుతున్నారు.

విష్ణు వైసీపీలో చేరితే బ్రాహ్మ‌ణ వర్గం ఓట‌ర్లు ఏపీలోనే ఎక్కువుగా ఉన్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటును ఆయ‌న‌కు ఇవ్వాలి. అయితే ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా వంగ‌వీటి రాధా ఉన్నారు. ఆయ‌న్ను త‌ప్పిస్తే చాలా ఈక్వేష‌న్లు తేడా వ‌స్తాయి. విష్ణు సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాకుండా తూర్పు నుంచి పోటీ చేసి గెల‌వ‌డం క‌ష్ట‌మే. ఆయ‌న గ‌తంలో సెంట్ర‌ల్‌లోనే పోటీ చేసి రాధాను ఓడించి ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు.

ఇక ఇప్పుడు విష్ణు కూడా వైసీపీలో చేర‌డంతో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు కోసం రాధా వ‌ర్సెస్ విష్ణు మ‌ధ్య వార్ స్టార్ట్ అయ్యిన‌ట్ల‌య్యింది.