వైసీపీలోకి సీనియర్.. అమ‌రావ‌తిలో టీడీపీకి ఇబ్బందే!

విప‌క్షం వైసీపీకి రాజ‌ధాని ప్రాంతం అమ‌రావ‌తిలో గ‌ట్టి ప‌ట్టు దొరుకుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప్రాంతంలో పార్టీని ముందుండి న‌డిపించ‌గ‌ల నేత వ‌స్తున్నాడా? ముఖ్యంగా టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి.. మొగుడు లాంటి కేండిట్ వైసీపీలోకి వ‌స్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. గ‌తంలో సెంట్ర‌ల్ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన మ‌ల్లాది విష్ణు ఇప్పుడు జ‌గ‌న్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని రెండు మూడు రోజులుగా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

నిజానికి గడచిన 2014 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో మెరుగైన ఫలితాలనే సాధించిన వైసీపీ… బెజవాడలోనూ తన సత్తా చాటింది. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌లీల్ ఖాన్‌కు టికెట్ ఇచ్చిన జ‌గ‌న్‌.. అఖండ మెజారిటీతో ఆయ‌న‌ను గెలిపించుకున్నారు. అయితే, ఇటీవ‌ల ఆయన మంత్రి ప‌ద‌విపై కాంక్ష‌తో సైకిలెక్కేశారు. ఈ క్రమంలో విజయవాడలో వంగవీటి రాధ ఉన్నా.. వైసీపీకి మరింత మంది నాయకుల అసవరం ఎంతైనా ఉంది. అదేస‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అధికారంలోకి వ‌చ్చేదీలేనిదీ ఆ పార్టీకే క్లారిటీలేని కాంగ్రెస్‌లో ఉన్న మ‌ల్లాది విష్ణు.. త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం ఎదురు చూస్తున్నారు.

దీనిని అందిపుచ్చుకున్న వైసీపీ.. ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకోవ‌డం ద్వారా నేత‌ల కొర‌త తీర్చుకోవ‌చ్చ‌ని భావిస్తోంది. గడచిన ఎన్నికల్లో రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ పార్టీకి అంటుకున్న కారణంగా మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ఎన్నికల్లో ఓటమిపాలైనా మల్లాది విష్ణుకు ఇప్పటికీ నగరంలో మంచి పట్టు ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆయనకు అనుచరవర్గాలున్నాయి. ఇటీవ‌లే రాజకీయాల్లోకి వచ్చిన కేశినేని నాని బొండా ఉమామహేశ్వరరావు – బోడె ప్రసాద్… తదితరులతో పోలిస్తే మల్లాది చాలా సీనియర్ కిందే లెక్క.

మల్లాది విష్ణు గనుక పార్టీలోకి వస్తే… టీడీపీ అరాచకాలను సమర్థంగా ఎదుర్కొనే సత్తా వైసీపీకి దక్కుతుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో మంచి సంబంధాలు నడిపిన మల్లాది… ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కలగలసి పోతారన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు పలికి వైసీపీలోకి చేరే విషయంపై మల్లాది ఇప్పటికే తన అనుచరవర్గంతో చాలా సార్లు ప్రత్యేకంగా భేటీలు నిర్వహించారట. ఈ నెల 8 – 9 తేదీల్లో విజయవాడలోనే వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఆ రెండు రోజుల్లోనే ఏదో ఒక సమయంలో మల్లాది… జగన్ సమక్షంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. అమ‌రావ‌తిలో వైసీపీ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేనంటున్నారు విశ్లేష‌కులు.