నంద్యాల ఓట‌ర్ల‌కు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు

నంద్యాల‌లో ప‌సుపు జెండా రెప‌రెప‌లాడించేందుకు స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. ఇది త‌మ నియోజ‌క‌వ‌ర్గ‌మ‌ని, నాయ‌కులు వెళ్లినా క్యాడ‌ర్ మాత్రం త‌మ వైపే ఉంద‌ని.. ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ చెబుతున్నారు. త‌మ అభ్య‌ర్థిగా ఆర్థికంగా, శ్రేణుల్లోనూ బ‌లంగా ఉన్న శిల్పామోహ‌న రెడ్డిని ప్ర‌క‌టించ‌డంతో చంద్ర‌బాబు అల‌ర్ట్ అయ్యారు. కేవ‌లం సెంటిమెంట్‌ను న‌మ్ముకునే బ‌రిలోకి దిగుతున్నామ‌న్న అప‌వాదు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా ఉండేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునేందుకు తాయిలాల మీద తాయిల‌లు ప్ర‌క‌టిస్తున్నారు. నిధులు, ఇళ్లు ఇలా.. ఓట‌ర్లను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు వ‌రాల మీద వ‌రాలు ప్ర‌క‌టించేస్తున్నారు.

కొద్ది రోజులుగా నంద్యాల పేరు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటు అధికార పక్షం, ఇటు ప్రతిప‌క్షం ఇలా.. ఎవ‌రికి వారు ఇక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందాలని వ్యూహాల మీద వ్యూహాలు ర‌చిస్తున్నారు. రెండు పార్టీలు ఇక్క‌డ గెలుపును ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన భూమా నాగిరెడ్డి.. టీడీపీలో చేర‌డంలో మొద‌లైన రాజ‌కీయ వేడి.. ఆయ‌న మ‌ర‌ణంతో మ‌రో మ‌లుపు తీసుకుంది. ఇక్క‌డ టికెట్ కోసం భూమా, శిల్పా వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొన‌డం.. ఆ టికెటు భూమా వ‌ర్గానికే చెంద‌డంతో.. శిల్పా మోహ‌న‌రెడ్డి వైసీపీలో చేర‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం సెంటిమెంట్‌తోనే బ‌రిలోకి దిగ‌బోతోంది.

అయితే నంద్యాల నియోజక‌వర్గాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్న సీఎం చంద్రబాబు ఆ ప్రాంత‌ వాసులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్రపతి ఎన్నికల తర్వాత వచ్చే వీలుంది. ఈలోపే సంక్షేమ కార్యక్రమాల పేరిట నంద్యాల ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. నంద్యాలకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీని ఇప్పటికే సిద్ధం చేశారు. వివిధ పథకాల కింద ఈ ప్యాకేజీని అమలు చేసేందుకు రెడీ అవుతున్నార‌ట‌. ఇందు కోసం ప్రణాళికను కూడా రూపొందించారు. ముఖ్యంగా ఎస్.సి, ఎస్టీ నిధుల కింద దళిత యువకులకు కార్లు, జీపులు పంపిణీ వేగవంతం చేశారు. హౌసింగ్ స్కిమ్ కూడా ఊపందుకుంది.

మంత్రివర్గ సమావేశంలోనూ నంద్యాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నారు. నంద్యాల మండలం మూలసాగరం గ్రామంలోని 472/2 సర్వే నెంబర్ లోని 49.9 ఎకరాలను బలహీన వర్గాల ఇల్లు నిర్మాణం కోసం మంత్రివర్గం కేటాయించింది. ఈ భూమి వాస్తవానికి జలవనరుల శాఖకు చెందింది. ఈ శాఖ నుంచి బదిలీ చేసి బలహీన వర్గాల ఇల్లు నిర్మాణం కోసం స్వాధీనం చేసుకోవడానికి కలెక్టర్ కు అనుమతిస్తూ మంత్రిమండలి ఆమోదించింది. దాదాపు యాభై ఎకరాల్లో బలహీన వర్గాల ఇల్లు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన కూడా చేయనున్నారు. మ‌రి చంద్ర‌బాబు.. పాచిక‌ల‌న్నీ ఇక్క‌డ ఫ‌లిస్తాయో లేదో!!