టీకాంగ్రెస్‌లో మూడు ముక్క‌లాట‌

విభ‌జ‌న తర్వాత ఏపీలో పూర్తిగా దెబ్బ‌తిన్నా.. తెలంగాణ‌లో మాత్రం కాంగ్రెస్ పున‌ర్వైభ‌వం కోసం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో.. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద చిక్కొచ్చి ప‌డింది. ఉన్న నేత‌లంద‌రూ సీఎం పీఠంపై క‌న్నేసి.. లాబీయింగ్‌కు కూడా తెర‌లేపారు. ఎవ‌రికి వారు తామే సీఎం అభ్య‌ర్థి అని ప్ర‌క‌టించేసుకుంటున్నారు. స‌ర్వేలు చేయించేస్తున్నారు. తన కంటే జూనియ‌ర్లు సీఎం కుర్చీ కోసం తెగ ప్ర‌య‌త్నిస్తుంటే.. నేనెందుకు ప్ర‌య‌త్నించ‌కూడ‌దు అనుకున్నారో ఏమో.. ఇప్పుడు ఈ రేసులోకి సీనియ‌ర్ నాయ‌కుడు జానారెడ్డి కూడా వ‌చ్చేశారు. అప్పుడే ప్ర‌య‌త్నాలు కూడా ముమ్మ‌రం చేశారు.

తెలంగాణ‌లో ఒక‌ప‌క్క సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి.. అన్ని వ‌ర్గాల అక్కున చేరేందుకు మ‌రిన్ని వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ఇచ్చినా.. ఆ క్రెడిట్‌ త‌మ పార్టీకి ద‌క్కేలా చేసుకోవ‌డంలో తెలంగాణ‌ కాంగ్రెస్ నేత‌లు పూర్తిగా విఫ‌ల‌మయ్యారు. ప్ర‌తిప‌క్షంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. అయితే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచిస్తుంటే.. నేత‌లు మాత్రం త‌లో దారి వెతుక్కుంటున్నారు. క్యాడ‌ర్ ఉన్నా దానిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోతున్నారు. అంద‌రూ స‌మ‌ష్టిగా కాంగ్రెస్ విజ‌యానికి ప‌నిచేయాల్సిందిపోయి.. సీఎం కుర్చీ కోసం తంటాలు ప‌డుతున్నారు.

తెలంగాణ‌ రాజ‌కీయాలు గ‌తం కంటే భిన్నంగా ఉన్నాయ‌నీ, 2019 ఎన్నిక‌ల్లో కేసీఆర్ ను త‌ట్టుకోవాలంటే కాంగ్రెస్ కూడా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిపై ఇప్ప‌ట్నుంచే ఓ క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుందంటూ కొంత‌మంది నేత‌లు ఆ మ‌ధ్య అభిప్రాయ‌ప‌డ్డారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌ని ఆ మ‌ధ్య కొంత‌మంది అధిష్టానానికి ఈ మాట చేర‌వేశారు! ఇక‌ ఎప్ప‌టికైనా తాను సీఎం అవుతాన‌ని ఆ మ‌ధ్య కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా మ‌న‌సులో మాట చెప్ప‌క‌నే చెప్పేశారు. ఇక‌, మిగిలింది.. సీనియ‌ర్ నేత జానారెడ్డి! ఇప్పుడు ఆయ‌న కూడా పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, ముందుగా పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విపై ఆయ‌న క‌న్నేసిన‌ట్టున్నారు.

టీ పీసీసీ బాధ్య‌త‌ల‌కు త‌న‌కు అప్ప‌గిస్తే మెరుగైన ఫ‌లితాలు సాధించిపెడ‌తా అని చెబుతూ ఢిల్లీ పెద్ద‌ల‌కి జానారెడ్డి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు స‌మాచారం. త‌న మూడు ద‌శాబ్దాల రాజకీయ అనుభ‌వంలో ఎన్నో ప‌ద‌వుల్లో ప‌నిచేశాన‌ని ఇత‌ర ఏ ప‌ద‌వులు ఆఫ‌ర్ చేసినా చిన్న‌వే అవుతాయ‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ట‌! త‌న మ‌న‌సులోని మాట‌ని ఇప్ప‌టికే కొంత‌మంది నేత‌ల‌తో జానారెడ్డి చెప్పార‌ట‌. త్వ‌ర‌లోనే ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని కూడా క‌లుసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని స‌మాచారం. ఆలూలేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న రీతిలో వీరి వ్య‌వ‌హారం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.