కొడాలి నాని పొలిటిక‌ల్ రూటు మారుతోందా..!

కృష్ణా జిల్లా గుడివాడ‌లో గ‌త ద‌శాబ్దంన్న‌ర‌గా తిరుగులేని రాజ‌కీయాలు చేస్తూ గుడివాడ ఫైర్‌బ్రాండ్‌గా మారిపోయాడు కొడాలి నాని. పార్టీ ఏదైనా ఆయ‌న మాత్రం వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలుస్తూనూ ఉన్నాడు. నాని గెలిచిన ప్ర‌తిసారి ఆయ‌న పార్టీ అధికారంలోకి రావ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నో ఇబ్బందుల్లో ఉంటున్నాడు…అయినా గెలుపు మాత్రం ఆయ‌న‌దే. దివంగ‌త మాజీ సీఎం ఎన్టీఆర్ గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన గుడివాడ ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. అలాంటిది ఇప్పుడు నానిని కంచుకోట‌గా మారింది.

ఇదిలా ఉంటే 2004, 2009లో టీడీపీ నుంచి గెలిచిన నాని, గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి మూడోసారి ఆ పార్టీ నుంచి గెలుపొందారు. నాని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా కాకుండా బంద‌రు ఎంపీగా బ‌రిలో ఉంటార‌ని గుడివాడలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో ఆయ‌న ఎమ్మెల్యేగా కాకుండా జిల్లా కేంద్ర‌మైన బంద‌రు నుంచి ఎంపీగా పోటీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి బందరు ఎంపీగా పోటీ చేసిన కొలుసు పార్థ‌సార‌థి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెన‌మ‌లూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్నారు. ఇక నాని బంద‌రు ఎంపీగా వెళ్లే క్ర‌మంలో గుడివాడ నుంచి త‌న సోదరుడు కొడాలి నాగేశ్వ‌ర‌రావును ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్‌.

నాని సోద‌రుడు అయిన నాగేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుతం గుడివాడ రాజ‌కీయాల్లో అన్న త‌ర‌పున అన్నీ తానే అయ్యి చ‌క్క‌పెడుతున్నాడు. ఈ క్ర‌మంలోనే తాను బంద‌రు ఎంపీగా వెళ్లినా, త‌న కంచుకోట‌లో ఇత‌రుల‌ను ఎంట‌ర్ కానివ్వ‌కుండా త‌న సోద‌రుడినే పోటీ చేయించేలా ప్ర‌ణాళిక వేసిన‌ట్టు స‌మాచారం.