టీడీపీ జంపింగ్‌కు కేసీఆర్ షాక్ తప్ప‌దా..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోను జంపింగ్‌ల జోరు ఎక్కువ‌గానే కొన‌సాగుతోంది. ఈ జంపింగ్‌ల పర్వం ఏపీలో కంటే తెలంగాణ‌లోనే ఎక్కువుగా కొన‌సాగుతోంది. తెలంగాణ‌లో కేసీఆర్ దెబ్బ‌తో టీడీపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ, వైసీపీ, సీపీఐల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు గులాబి గూటికి చేరిపోయారు. అత్తెస‌రు మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేల దెబ్బ‌తో తిరుగులేని మెజార్టీతో ఉంది.

ఇదిలా ఉంటే ఇత‌ర పార్టీల నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలంద‌రికి కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇస్తామ‌న్న హామీతో పాటు అభివృద్ధి ప‌నుల‌కు కోట్లాది రూపాయ‌లు మంజూరు చేస్తామ‌ని చెప్ప‌డంతో చాలా మంది పార్టీ కండువాలు మార్చేశారు. అయితే ఇప్పుడు వీరిలో కొంద‌రికి కేసీఆర్ షాక్ ఇవ్వ‌క త‌ప్ప‌ద‌ని తాజా రాజ‌కీయ ప‌రిణామాలు చెపుతున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో శేరిలింగంప‌ల్లి నుంచి భారీ మెజార్టీతో గెలిచిన అరికెపూడి గాంధీ ఆ త‌ర్వాత టీఆర్ఎస్ నుంచి వ‌స్తోన్న ఒత్తిళ్ల‌తో గులాబి గూటికి చేరిపోయారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు మరోసారి శేరిలింగంప‌ల్లి సీటు ద‌క్కుతుందా ? అంటే చాలా సందేహాలే వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం తాండూరు నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డి ఈ సీటుపై క‌న్నేసి అక్క‌డ చాప‌కింద నీరులా దూసుకుపోతున్నారు.

ఈ క్ర‌మంలోనే మ‌హేంద‌ర్‌రెడ్డి ఇట‌వ‌ల త‌రచూ శేరిలింగంప‌ల్లిలో ప‌ర్య‌టిస్తూ అక్క‌డ ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి కేసీఆర్ మంత్రిగా మ‌హేంద‌ర్‌రెడ్డికి శేరిలింగంపల్లి సీటు ఇచ్చేందుకు ఒప్పుకుంటే అరికెపూడి గాంధీ సీటుకు ఎర్త్ త‌ప్పేలా లేదు. ఇక మ‌హేంద‌ర్‌రెడ్డికి కేటీఆర్ అండ కూడా ఉంది.

మ‌హేంద‌ర్‌రెడ్డికి తాండూరులో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇటీవ‌ల తాండూరు మునిసిపాలిటీ పీఠం కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో కూడా మంత్రిపై వ్య‌తిరేక‌త పెర‌గ‌డంతో ఆయ‌న శేరిలింగంప‌ల్లికి మారాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.