ఆ మంత్రుల‌కు చంద్ర‌బాబు వార్నింగ్ వెన‌క‌..!

టీడీపీ అంటే ఒక‌ప్పుడు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరు. టీడీపీ వాళ్లంతా ఒకే కుటుంబంలోని అన్న‌ద‌మ్ముళ్లా క‌లిసి మెలిసి ఉండేవారు. అయితే అదంతా గ‌తం ఇప్పుడు సీన్ మారిపోయింది. 2014 ఎన్నిక‌ల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక పార్టీలో ఎవ‌రికి వారే ఇష్ట‌మొచ్చిన‌ట్టు స్వ‌రం పెంచేస్తున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు వార్నింగ్‌లు కూడా ప‌ని చేయ‌డం లేదు. చాలా మంది అయితే చంద్ర‌బాబునే లైట్ తీస్కొంటున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది.

ఎవ‌రో ఒక నాయ‌కుడు నోరు జార‌డం, అది మీడియాలో హైలెట్ అవ్వ‌డం, వాళ్ల‌కు క్లాస్ పీక‌డం అవ్వ‌గానే ఆ వెంట‌నే మ‌రో నాయ‌కుడు టంగ్ స్లిప్ అవుతున్నాడు. వాళ్లు ఇలా టంగ్ స్లిప్ అవుతూ పోతుంటే చంద్ర‌బాబు ఎంత‌మందిక‌ని వార్నింగ్‌లు, క్లాస్‌లు పీక్కుంటూ పోతుంటారు. గ‌తంలో తొమ్మదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈ సారి మాత్రం పార్టీ నేత‌ల‌తో చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి. పార్టీలో సీనియ‌ర్లు లేని లోటు ఏంటో బాబుకు స్ప‌ష్టంగా తెలిసొస్తోంది.

ఇక ఇది వ‌ర‌కు ఎవ‌రైనా మంత్రులు మీడియాతో మాట్లాడాల‌న్నా సీఎం పీఆర్ రిలేష‌న్‌తోనే ప్రెస్‌మీట్లు పెట్టేవారు. ఇప్పుడు ఎల‌క్ట్రానిక్ మీడియా ఎఫెక్ట్ పెరిగిపోవ‌డంతో వాళ్లే మంత్రులు, ఎమ్మెల్యేల ముందుకు వ‌చ్చి గొట్టాలు పెట్టేస్తున్నారు. వాళ్లు ఏదో ఒక మాట తూల‌డంతో అది మీడియాలో హైలెట్ అవుతోంది. అటు ప్ర‌భుత్వానికి, ఇటు పార్టీకి పెద్ద చిక్కులు తెచ్చి పెడుతోంది.

ఈ కాంట్ర‌వ‌ర్సీ డైలాగ్స్ చేసే వారి లిస్టులో ఎంపీలు కేశినేని నాని, జేసీ దివాక‌ర్‌రెడ్డి నుంచి మంత్రులు గంటా శ్రీనివాస‌రావు, అయ్య‌న్న‌పాత్రుడు, శివ‌ప్ర‌సాద్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగానే ఉంటుంది. చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేశ్ సైతం ఏం మాట్లాడ‌బోయి ? ఏం మాట్లాడుతున్నాడో ? ఎవ‌రికి తెలియ‌డం లేదు.

కేశినేని డైలాగ్స్ బీజేపీ – టీడీపీ మ‌ధ్య మంట పుట్టించాయి. జేసీ ఎయిర్‌పోర్టులో వీరంగంతో పార్టీ ప‌రువు దేశ‌వ్యాప్తంగా ఖ‌ల్లాస్ అయ్యింది. ఇప్పుడు ఎక్సైజ్ మంత్రి జ‌వ‌హ‌ర్ బీరు హెల్త్ డ్రింక్ అని చేసిన వ్యాఖ్య కూడా పార్టీని, ప్రభుత్వాన్ని డామేజ్ చేసింది. దీంతో చిర్రెత్తిపోతోన్న చంద్ర‌బాబు జూనియ‌ర్ మంత్రులు మీడియాకు దూరంగా ఉండాల‌ని వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.