ప‌శ్చిమ‌లో పంచాయితీలు చేయ‌లేక చేతులెత్తేసిన బాబు

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీకి ఎంత కంచుకోటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 2 ఎంపీ సీట్ల‌తో పాటు 15 ఎమ్మెల్యే సీట్ల‌ను టీడీపీ గెలుచుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్ప‌టి నుంచి ఈ జిల్లాలో అధికార పార్టీ నాయ‌కుల మ‌ధ్య గ్రూపు రాజ‌కీయాల‌తో చంద్ర‌బాబుకు రోజూ ఏదో ఒక త‌ల‌నొప్పిగా మారుతోంది. ఇక్క‌డ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయి.

గ‌తంలో మంత్రిగా ఉన్న పీత‌ల సుజాత‌కు, ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు ప‌డ‌దు. బాబుకు పోల‌వ‌రం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు ప‌డ‌దు. ఇక జ‌డ్పీ చైర్మ‌న్ బాపిరాజుకు, బీజేపీ మంత్రి మాణిక్యాల‌రావుకు పొస‌గ‌దు. గోపాల‌పురం ఎమ్మెల్యే ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావుకు బాపిరాజుకు కూడా అస్స‌లు ప‌డ‌డం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గొడ‌వ‌ల‌కు లెక్కే లేదు. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే దూకుడుగా ఉండే విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు చైర్మ‌న్ బాపిరాజుకు కూడా లెక్క ఎక్క‌డో తేడా వ‌చ్చింద‌ట‌.

ఈ జిల్లాలో విబేధాల ప‌రిష్కారానికి చంద్ర‌బాబు ఎన్నోసార్లు చొర‌వ చూపినా, వార్నింగ్‌లు ఇచ్చినా నాయ‌కుల తీరు మాత్రం మార‌డం లేదు. జ‌డ్పీ చైర్మ‌న్ బాపిరాజు- మంత్రి మాణిక్యం మ‌ధ్య పంచాయితీని పరిష్క‌రించేందుకు చంద్ర‌బాబే ఎన్నోసార్లు ప్ర‌య‌త్నాలు చేసినా వారి వివాదం ఆగ‌లేదు. ఇక చింత‌ల‌పూడి ఏఎంసీ పాల‌క‌వ‌ర్గం పార్టీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అవుతున్నా ఇంకా భ‌ర్తీ చేయ‌లేదు. ఇక్క‌డ ఎంపీ మాగంటి, మాజీ మంత్రి పీత‌ల చెరో వ‌ర్గాన్ని సపోర్ట్ చేస్తున్నారు.

ఇక గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రత్యర్థులకు పదవులు పంచి పెడుతున్నారని ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఇక్క‌డ ద్వార‌కాతిరుమల‌ మండ‌ల పార్టీ అధ్య‌క్షుడి ఎంపిక‌లో ఎమ్మెల్యే తీరును నిర‌సిస్తూ ఇటీవ‌ల‌ 12 మంది ఎంపీటీసీలు, నీటి సంఘాల అధ్యక్షులు, ఏఎంసీ ఛైర్మన్, 18 మంది సర్పంచ్ లు ఎమ్మెల్యేకు అల్టిమేటం జారీ చేశారు. ఓ ఎమ్మెల్యేను ఇంత‌మంది స‌వాల్ చేయ‌డం చూస్తుంటే ఇక్క‌డ ఎమ్మెల్యేకు నాయ‌కుల‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్ అర్థ‌మ‌వుతోంది.

ఇక చింతలపూడి నియోజకవర్గంలోనూ పీతల సుజాతకు వ్యతిరేకంగా పెద్ద సభనే ఏర్పాటు చేశారు. అయితే జిల్లా పార్టీ అధ్య‌క్షురాలు జోక్యం చేసుకోవ‌డంతో ఇది చివ‌ర్లో ర‌ద్దు అయ్యింది. జిల్లాలో నాయ‌కుల మ‌ధ్య‌ పంచాయితీలు చేయ‌లేక విసిగిపోయిన చంద్ర‌బాబు ఈ బాధ్య‌త‌ల‌ను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు అప్ప‌గించ‌గా ఆయ‌న కూడా ఇక్క‌డ వివాదాలు ప‌రిష్క‌రించ‌లేక చేతులెత్తేశారు.