చేతులెత్తేసిన భూమా ఫ్యామిలీ…రంగంలోకి నారాయ‌ణ‌

నంద్యాల ఉప ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నటీడీపీ మ‌రో ప‌క్క ఎన్నిక జ‌రిగితే గెలిచేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే నంద్యాల‌లో టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు అప్పుడే తెర‌లేపేసింది. ఉప ఎన్నిక నేప‌థ్యంలో అప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పార్టీ వీడి వెళ్ల‌డంతో ఆయ‌న వెంట మునిసిప‌ల్ చైర్మ‌న్‌తో పాటు చాలా మంది కౌన్సెల‌ర్లు సైతం వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో నంద్యాల మునిసిపాలిటీ వైసీపీ ప‌రం అయ్యింది.

ఈ క్ర‌మంలోనే ముందుగా మునిసిపాలిటీని టీడీపీ ఖాతాలో వేయాల‌ని డిసైడ్ అయిన టీడీపీ కౌన్సెల‌ర్ల‌కు గాలం వేసే ప‌నిలో ప‌డింది. ఈ క్ర‌మంలోనే మునిసిప‌ల్ మంత్రి నారాయ‌ణ ఈ రోజు నంద్యాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్టారు. అక్క‌డ టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన కౌన్సెల‌ర్ల‌ను తిరిగి టీడీపీలోకి తీసుకు వ‌చ్చేందుకు ఆయ‌న లోక‌ల్ ఆప‌రేష‌న్‌కు శ్రీకారం చుట్టారు.

వాస్త‌వానికి స్థానిక కౌన్సెల‌ర్ల‌ను టీడీపీలోకి ర‌ప్పించేందుకు భూమా వ‌ర్గం విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌ర‌కు వాళ్లు చెతులెత్తేయ‌డంతో ఈ విష‌యం చంద్రబాబు వ‌ర‌కు వెళ్లింది. దీంతో ఆయన కౌన్సిలర్లను తిరిగి దేశం పార్టీలోకి రప్పించేందుకు మంత్రి నారాయణను రంగంలోకి దించారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు పెద్ద‌గా స‌మ‌యం లేక‌పోవ‌డంతో చాలా మంది కౌన్సెల‌ర్లు పార్టీ మారేందుకు ఆస‌క్తితో లేన‌ట్టు తెలుస్తోంది.

దీంతో వారిని ఎట్టి ప‌రిస్థితుల్లోను అభివృద్ధి ప‌నుల‌తో పాటు మ‌నీ ఎర‌వేయ‌డం ద్వారా టీడీపీలోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. శిల్పా మోహన్ రెడ్డి వెంట సుమారు 25 మంది కౌన్సిలర్లు వైసీపీలోచేరడంతో నంద్యాల మున్సిపాలిటీ వైసీపీ పరమైంది. మ‌రి నారాయ‌ణ నంద్యాల‌లో ఆప‌రేష‌న్ లోక‌ల్‌ను ఎంత వ‌ర‌కు స‌క్సెస్ చేస్తారో ? చూడాలి.