భూకుంభ‌కోణంపై కేసీఆర్ తగ్గేదే లేదా!

తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రో షాకింగ్ డెసిష‌న్‌కు రెడీ అవుతున్నారా ? అంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లోను, తెలంగాణ అధికార వ‌ర్గాల్లోను వినిపిస్తోన్న క‌థ‌నాల ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. తెలంగాణ‌లో అటు ప్ర‌భుత్వంతో పాటు ఇటు మంత్రుల ప‌నితీరుపై చిన్న‌పాటి ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు రావ‌డానికి కూడా కేసీఆర్ ఒప్పుకోవ‌డం లేదు. ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే వాళ్ల స్థాయిని బ‌ట్టి కేసీఆరే ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ ఏకేస్తున్నారు. త‌నతో పాటు త‌న ప్ర‌భుత్వంపై ఎవ్వ‌రికి నిర్మాణాత్మ‌క విమ‌ర్శ చేసే ఛాన్స్ కేసీఆర్ అస్స‌లు ఇవ్వ‌డం లేదు.

అలాంటి కేసీఆర్ స‌ర్కార్‌కు మియాపూర్ భూకుంభ‌కోణం పెద్ద‌త‌ల‌నొప్పిగా మారింది. ఈ కేసులో పార్టీకి చెందిన సీనియ‌ర్ లీడ‌ర్‌, రాజ్య‌స‌భ్యుడు కె.కేశ‌వ‌రావుతో పాటు ఆయ‌న కుమార్తె బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ విజ‌య‌ల‌క్ష్మి పేరిట భూములు రిజిస్ట్రేష‌న్ చేయించిన‌ట్టు వ‌స్తోన్న వార్త‌లు అధికార పార్టీని ఓ కుదుపు కుదిపేశాయి. ఇవి విప‌క్షాల‌కు పెద్ద బ‌లంగా మారాయి.

మియాపూర్ ప్ర‌భుత్వ భూముల స్కాంతో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్ర‌భుత్వ భూముల ఆక్ర‌మ‌ణ‌లు, ప‌రాధీనంపై కేసీఆర్ చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై పెద్ద‌గా కాన్‌సంట్రేష‌న్ చేయ‌ని కేసీఆర్ ఇప్పుడు రెవెన్యూ శాఖ‌ను పూర్తి స్థాయిలో సంస్క‌రించేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ శాఖ‌లో ప‌నిచేస్తోన్న చాలా మంది ఉన్న‌తాధికారుల్లో కొంద‌రిపై వేటు వేయ‌డం, మ‌రికొంద‌రిని చెల్లాచెదురుగా బ‌దిలీ చేసే కార్య‌క్ర‌మానికి ఆయ‌న శ్రీకారం చుట్ట‌నున్నారు.

ఇప్ప‌టికే మియాపూర్ స్కాంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలున్న సబ్ రిజిస్ట్రార్లను పెద్దఎత్తున బదిలీ చేయడంతోపాటు ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న మరో ముగ్గురిని ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ శాఖ‌ను నిర్వ‌హిస్తోన్న ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ ఆలీ నుంచి ఈ శాఖ‌ను త‌ప్పించి స్వ‌యంగా కేసీఆరే నిర్వ‌హించాల‌ని భావిస్తున్నార‌ట‌.

ఆలీకి రెవెన్యూ విష‌యాల్లో ప‌ట్టులేక‌పోవ‌డంతో పాటు ఆయ‌న మాట సీనియ‌ర్ అధికారులు ఎవ్వ‌రూ లెక్క‌చేయ‌డం లేద‌ట‌. దీంతో ఈ శాఖ‌లో అవినీతి, అక్ర‌మాల‌కు చెక్ పెట్టాల‌ని డిసైడ్ అయిన కేసీఆర్ ఇప్పుడు ఆలీకి ఆ శాఖ‌ను క‌ట్ చేస్తార‌న‌డం మ‌రో సంచ‌ల‌న‌మే అవుతుంది. గ‌తంలో ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న రాజ‌య్య‌ను ఏకంగా బ‌ర్త‌ర‌ఫ్ చేసిన ఆయ‌న ఇప్పుడు ఆలీ విష‌యంలో శాఖ‌ల‌కు క‌త్తెర పెడితే అది మ‌రో సంచ‌ల‌న‌మే అవుతుంది.