టీడీపీ కంచుకోట‌లో ముగ్గురు ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేస్తారా..!

వెస్ట్ గోదావ‌రి అంటేనే టీడీపీకి బ‌ల‌మైన కంచుకోట‌. టీడీపీ ఆవిర్భావం నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసిన సంద‌ర్భాలున్నాయి. చంద్ర‌బాబు ప్ర‌స్తుతం సీఎంగా ఉన్నాడంటే అందుకు వెస్ట్ గోదావ‌రే కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో 15 సీట్లు, 2 ఎంపీలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అయితే ప్ర‌స్తుతం జిల్లాలో కొంద‌రు ఎమ్మెల్య‌ల ప‌నితీరుతో టీడీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌క్క‌న పెట్టేస్తార‌న్న వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో మెట్ట‌ప్రాంతం టీడీపీకి బ‌ల‌మైన కంచుకోట‌. చింత‌ల‌పూడి, పోల‌వ‌రం, గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీకి ముందునుంచి బ‌లంగా ఉంటున్నాయి. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు సైతం ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలిచిన సంద‌ర్భాలున్నాయి.

ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు బ‌లంగా ఎదురుగాలి వీస్తోంది. చింత‌ల‌పూడి నుంచి గెలిచిన పీత‌ల సుజాతకు చంద్ర‌బాబు మంత్రిగా త‌న కేబినెట్‌లో చోటు ఇచ్చారు చంద్ర‌బాబు. ఈ మూడేళ్ల‌లో సుజాత తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో సైతం సుజాత‌కు బ‌లంగా వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. సుజాత‌కు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఆమె ప‌నితీరు మార‌క‌పోవ‌డంతో ఆమెను బాబును కేబినెట్ నుంచి త‌ప్పించేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి సుజాత‌కు టిక్కెట్ ఇస్తే ఆమె గెలుపుకోసం ప‌నిచేసేందుకు నియోజ‌క‌వ‌ర్గంలో క్యాడ‌ర్ కాదు…నాయ‌కుల్లోనే చాలా మంది ప‌నిచేసేందుకు సిద్దంగా లేరు. దీనిపై బాబుకు ఇప్ప‌టికే నివేదిక వెళ్ల‌డంతో సుజాత‌ను మార్చే ప్ర‌య‌త్నాల్లో బాబు ఉన్నార‌ని తెలుస్తోంది.

ఇక పోల‌వ‌రం నుంచి గెలిచిన మెడియం శ్రీనివాస్ అభివృద్ధి కంటే అవినీతిలోనే ముందుకు దూసుకెళ్లుతున్నార‌న్న దారుణ‌మైన విమ‌ర్శ‌లు మూట‌క‌ట్టుకుంటున్నారు. సాధార‌ణ కార్య‌క‌ర్త అయిన మెడియంకు ఏలూరు ఎంపీ మాగంటి బాబు చొర‌వ‌తో టిక్కెట్ వ‌చ్చింది. మెడియం ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల‌కే మాగంటినే విబేధించారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ మాగంటి, మెడియం గ్రూపులుగా చీలిపోయింది. ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ క్యాడ‌ర్‌ను ప‌ట్టించుకోవాల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయినట్టు క‌నిపిస్తోంది.

పోల‌వ‌రంలో పార్టీ ప‌రిస్థితి భారీగా దిగ‌జారిపోవ‌డానికి ఎమ్మెల్యే తీరే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఎమ్మెల్యే కమీష‌న్లు, క‌క్కుర్తి వ్య‌వ‌హారాలు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి మైన‌స్‌గా మారియి. మొడియం రిపోర్ట్ కూడా చంద్ర‌బాబుకు చేర‌డం ఆయ‌న వార్నింగ్ ఇవ్వ‌డం జ‌రిగాయ‌ని తెలుస్తోంది. మొడియంకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు రావ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. మొడియంకు టిక్కెట్టు విష‌యంలో ఎంపీ మాగంటితో పాటు నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నాయ‌కులే ఒప్పుకునే ప‌రిస్థితి లేదు.

ఇక గోపాల‌పురం ఎమ్మెల్యే ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు ప‌నితీరు సైతం ప‌క్క నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేలు పీత‌ల‌ సుజాత‌, మెడియం శ్రీనివాస్‌తో పోటీప‌డేలా ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవాల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయిన ముప్పిడి నియోజ‌క‌వ‌ర్గంలో చిన్న స‌మ‌స్య ప‌రిష్కారానికి కూడా నాయ‌కుల‌ను ప‌దే ప‌దే తిప్పించుకుంటున్నాడు. గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి కంచుకోట‌లుగా ద్వార‌కాతిరుమ‌ల‌, న‌ల్ల‌జ‌ర్ల మండ‌ల టీడీపీ నాయ‌కులు ముప్పిడిపై భ‌గ్గుమంటున్నారు. ఇక్క‌డ ఎమ్మెల్యేతో ప‌నులు కాక‌పోవ‌డంతో వీరంతా జ‌డ్పీచైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు వ‌ద్ద‌కు వెళ్లి ప‌నులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నాయ‌కులు త‌మ‌కు ఎమ్మెల్యే ముప్పిడి అన్న విష‌యాన్ని కూడా మ‌ర్చిపోయారు.

ఏదేమైనా ఈ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల ప‌నితీరుపై ఇప్ప‌టికే బాబుకు చేరిన రిపోర్టులు, సొంత పార్టీలోనే జ‌రుగుతోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు రావ‌డం క‌ష్టమే.