భూ కుంభ‌కోణంలో డీఎస్‌.. కేసీఆర్‌కి మ‌రో త‌ల‌నొప్పి!

తెలంగాణలో అధికార పార్టీ ఇప్పుడు భూ కుంభ‌కోణాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఆయా కుంభ‌కోణాల్లో కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుల పేర్లు ఉండ‌డం మ‌రింత‌గా ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. మియాపూర్ భూ కుంభ‌కోణం కేస‌లో టీఆర్ ఎ స్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ కేకే పేరు బాహాటంగానే వినిపించింది. దీంతో ఏకంగా కేసును తానే బ‌ద‌లాయించుకుని ప‌ర్య‌వేక్షిస్తున్నారు కేసీఆర్‌. ఇక‌, ఇప్పుడు తాజాగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, కేసీఆర్‌కి అత్యంత ఆప్తుడు సీనియ‌ర్ పొలిటీషియ‌న్ అయిన ధ‌ర్మ‌పురి శ్రీనివాస్‌(డీఎస్‌)పైనే భూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

రూ.నాలుగు కోట్ల విలువ చేసే అసైన్డ్ భూమిని డీఎస్ రిజిస్ట్రేష‌న్ చేయించుకునేందుకు ప్ర‌య‌త్నించార‌నేది ఆరోప‌ణ‌. మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ భూమిని డీఎస్ కొనుగోలు చేశారని చెబుతున్నారు. గతంలో ఈ భూమిని కొనుగోలు చేసేందుకు పలువురు ప్రయత్నించినా నో చెప్పిన అధికారులు.. డీఎస్ విషయంలో మాత్రం ఓకే చేసేయటమే కాదు.. ఏకంగా రిజిస్ట్రేషన్ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామ పరిధిలోని గౌడవెల్లి – రాయిలాపూర్ రోడ్డులో సర్వే నెంబరు 221లో 8.9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.

ఈ భూమిని 1972-73లలో అదే గ్రామానికి చెందిన బొక్క యాదిరెడ్డి అనే రైతు నిరుపేదల నుంచి కొనుగోలు చేశాడు. మూడేళ్ల తర్వాత యాదిరెడ్డి నుంచి అతడి సోదరుడు రాజిరెడ్డి భూములు కొన్నాడు. ఆయన మృతి చెందిన తర్వాత ఆ భూములు సాయిరెడ్డి.. బల్వంత్ రెడ్డి.. రఘుపతిరెడ్డి పేర్ల మీద విరాసత్ చేశారు. అసైన్డ్ భూమి మీద హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. అసైన్డ్ భూముల్ని వాటి లబ్థిదారులు అనుభవించటానికి వీలు ఉంటుందే తప్పించి.. ఇతరులకు అమ్మే హక్కు ఉండదు.

అయితే.. ఈ భూముల‌ను డీఎస్ కు.. ఆయన అనుచరుడు ఎ.వి. సత్యనారాయణ రావుకు 2015లో సంబంధిత వ్య‌క్తులు అమ్మారు. డీఎస్ పేరిట నాలుగు ఎకరాలు.. ఎ.వి. సత్యనారాయణ పేరిట రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ ను మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ చేశారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో మ్యుటేషన్ కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ చేయటానికి నో చెప్పారు.

ఓపక్క ప్రభుత్వ భూములు పక్కదారి పట్టే అవకాశమే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా చెబుతున్న వేళలో.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన డీఎస్ అలాంటి భూముల్ని కొనుగోలు చేసిన వైనం బయటకు రావటం గమనార్హం. ఏమైనా.. అన్ని తెలిసిన శీనన్న ఇలాంటి పని చేయటాన్ని పలువురు తప్ప పడుతున్నారు. నాలుగో కోట్ల కోసం ఇంత చెడ్డ పేరు కొని తెచ్చుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. మ‌రి దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.