టీడీపీలో సస్పెన్షన్ల పరంపర..మరి ఆ ఇద్దరి ఎంపీల సంగతేంటో..?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఈ స‌స్పెన్ష‌న్ల ప‌ర్వానికి బ్రేక్ ఎప్పుడు ప‌డుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఈ జాబితాలో చ‌ట్ట‌స‌భ‌ల్లో ఉన్న ఎమ్మెల్యేల నుంచి కౌన్సెల‌ర్ల వ‌ర‌కు ఉంటున్నారు. వీరికి తోడు ఇప్పుడు ఏకంగా ఒక‌రిద్ద‌రు ఎంపీలు సైతం పార్టీనే ధిక్క‌రిస్తున్నారు. వారి పేర్లు సైతం స‌స్పెన్ష‌న్ జాబితాలో ఉన్నా వారిపై పార్టీ అధిష్టానం చ‌ర్య‌లు తీసుకునేందుకు సాహ‌సించ‌లేని ప‌రిస్థితి.

టీడీపీ స‌స్పెన్ష‌న్ల ప‌రంప‌ర‌లో మరో నాయకుడు ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌ కు గురయ్యారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డిపై వేటు వేశారు. ఆయనపై మూడు నెలల పాటు వేటు ప‌డింది. మునిసిపాలిటీలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిని అనే ధైర్యం ఎవ్వ‌రూ చేయ‌లేరు. అయితే అక్క‌డ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అవినీతికి పాల్ప‌డుతున్నారంటూ జ‌య‌చంద్రారెడ్డి ఓపెన్‌గానే ఆరోప‌ణ‌లు చేశారు.

ఇంకేముందు ప్ర‌భాక‌ర్‌రెడ్డి జ‌య‌చంద్రారెడ్డిపై వేటుకు ప‌ట్టుబ‌ట్టారు. ప్ర‌భాక‌ర్‌రెడ్డికి క్ష‌మ‌పణ చెప్పాల‌ని జిల్లా టీడీపీ నాయ‌కులు చెప్పినా జ‌య‌చంద్రారెడ్డి మాత్రం అస్స‌లు వెన‌క్కు త‌గ్గ‌లేదు. దీంతో టీడీపీ ఆయ‌న‌పై మూడు నెల‌ల పాటు వేటు వేసింది. ఇక ఇప్ప‌టికే టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డిని టీడీపీ ఇటీవల బహిష్కరించింది. బ్యాంకులకు డబ్బులు ఎగవేశారని ఆరోపణలు రావడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని అంతకుముందు టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

మ‌రి ఆ ఇద్ద‌రు ఎంపీల సంగ‌తేంటో..!

ఇక పార్టీ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితో పాటు అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి సైతం ప‌దే ప‌దే అధిష్టానానికి త‌ల‌నొప్పి క‌లిగించే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అంత‌కు ముందు చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ సైతం ఇలాగే చేసినా ఇప్పుడు ఆయ‌న కాస్త సైలెంట్ అయ్యారు. కేశినేని, జేసీ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. మ‌రి వీరి విష‌యంలో టీడీపీ స‌స్పెండ్ చేసే చ‌ర్య‌లు ఎందుకు తీసుకోవ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.