వైసీపీలోకి కోట్ల ఫ్యామిలీ….జ‌గ‌న్ రెండు ఆఫ‌ర్లు

రాయ‌ల‌సీమ‌లోని క‌ర్నూలు జిల్లాలో గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంగా టీడీపీ అష్ట‌క‌ష్టాలు ఎదుర్కొంటోంది. వైఎస్ గాలిలో 2004, 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ దూకుడు ముందు టీడీపీ తేలిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. వైసీపీ దూకుడుతో టీడీపీ కేవ‌లం మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్ర‌మే గెలిచింది. ప‌త్తికొండ నుంచి సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గ‌జం కేఈ.కృష్ణ‌మూర్తి, బ‌న‌గాన‌ప‌ల్లి నుంచి బీటీ.జ‌నార్థ‌న్‌రెడ్డి, ఎమ్మిగ‌నూరు నుంచి జ‌య‌నాగేశ్వ‌ర్‌రెడ్డి విజ‌యం సాధించారు. వైసీపీ 11 ఎమ్మెల్యేల‌తో పాటు క‌ర్నూలు, నంద్యాల ఎంపీ సీట్లు గెలుచుకుంది.

ఆ త‌ర్వాత టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌తో భూమా ఫ్యామిలీతో పాటు మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైకిలెక్కినా ఆ పార్టీ మాత్రం సంస్థాగ‌తంగా చాలా స్ట్రాంగ్‌గానే ఉన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఇదిలా ఉంటే త‌మ పార్టీ ఎమ్మెల్యేలు సైకిలెక్క‌డంతో ఆ లాస్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పూడ్చుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్ జిల్లాలో తిరుగులేని క్రేజ్ ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల ఫ్యామిలీపై క‌న్నేశారు.

మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న వైసీపీలో చేర‌తార‌న్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కోట్ల ఫ్యామిలీని ఎలాగైనా వైసీపీలో చేర్చుకోవాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కోట్ల ఫ్యామిలీకి రెండు సూప‌ర్ ఆఫ‌ర్లు ఇచ్చిన‌ట్టు కూడా జిల్లా రాజ‌కీయాల్లో టాక్ న‌డుస్తోంది.

పార్టీలో చేరితే కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డికి క‌ర్నూలు ఎంపీ సీటు, ఆయ‌న భార్య, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత‌మ్మ‌కు ఆలూరు సీటు ఇస్తాన‌ని జ‌గ‌న్ ఆఫ‌ర్ చేశార‌ట‌. ఆలూరు సుజాత‌మ్మ పుట్టినిల్లు. గ‌తంలో ఆమె డోన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మ‌రో షాకింగ్ న్యూస్ ఏంటంటే గ‌త ఎన్నిక‌ల్లో సుజాత‌మ్మ ఆలూరు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసినా ఏకంగా 23 వేల ఓట్లు తెచ్చుకుని అంద‌రికి షాక్ ఇచ్చారు.

కోట్ల కాస్త లేట్ అయినా వైసీపీలో చేర‌డం క‌న్‌ఫార్మ్ అన్న టాక్ జిల్లాలో న‌డుస్తోంది. మ‌రి కోట్ల వైసీపీలో చేరితే ప్ర‌స్తుతం క‌ర్నూలు ఎంపీగా ఉన్న బుట్టా రేణుకకు, ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌య‌రాంకు షాక్ త‌ప్ప‌దు. ఏదేమైనా కోట్ల వైసీపీ ఎంట్రీ ఇస్తే క‌ర్నూలులో టీడీపీకి స‌వాల్ లాంటిదే.