ప‌శ్చిమ‌గోదావ‌రి వైసీపీలో జ‌గ‌న్ బాంబు

2014 ఎన్నిక‌లకు 2019 ఎన్నిక‌ల‌కు ఏపీ వైసీపీలో రాజ‌కీయ ప‌రిణామాలు ఎలా మార‌తాయో ఊహ‌కే అంద‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో వైసీపీ జిల్లాలో ఖాతా తెర‌వ‌లేదు. 15 ఎమ్మెల్యే స్థానాల‌తో పాటు 3 ఎంపీ సీట్ల‌లోను ఓడిపోయింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీపై పైచెయ్యి సాధించేందుకు జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వాళ్ల‌లో చాలామందిని ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ ఈ జిల్లా వ‌ర‌కు తీసుకునే నిర్ణ‌యాలు వైసీపీలో పెద్ద బాంబ్ బ్లాస్ట్‌గానే మిగ‌ల‌నున్నాయ‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు.

గ‌త ఎన్నిక‌ల్లో ఏలూరు నుంచి ఎంపీగా పోటీచేసిన తోట చంద్ర‌శేఖ‌ర్‌ను ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్ ఆ ప్లేస్‌లో మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు త‌న‌యుడు కోట‌గిరి శ్రీథ‌ర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్పుడు కొత్త టాక్ ఏంటంటే శ్రీథ‌ర్‌కు ఏలూరు ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఎంపీ సీటు మ‌రొక‌రికి ఇస్తార‌ని తెలుస్తోంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో గోపాల‌పురం నుంచి పోటీచేసిన త‌లారి వెంక‌ట్రావును ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే అంటున్నారు.

కొవ్వూరు నుంచి పోటీచేసిన తానేటి వ‌నిత‌కు గోపాల‌పురం సీటు ఇచ్చి కొవ్వూరు సీటును మ‌రొక‌రికి ఇస్తార‌ని టాక్‌. దెందులూరు నుంచి పోటీచేసిన కారుమూరి నాగేశ్వ‌ర‌రావును త‌ణుకు పంపేసిన జ‌గ‌న్ అక్క‌డ నుంచి పోటీచేసిన చీర్ల రాధ‌య్య‌ను ప‌క్క‌న పెట్టేశారు. దెందులూరులో గ‌తంలో ఇన్‌చార్జ్‌గా ఉన్న కొఠారు త‌న‌యుడికి బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. ఇక తాడేప‌ల్లిగూడెంలో గ‌తంలో పోటీచేసిన తోట గోపీకి బ‌దులుగా కొట్టు స‌త్య‌నారాయ‌ణ రంగంలో ఉండే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.

గ‌తంలో ఆచంట‌లో పోటీచేసిన ప్ర‌సాద‌రాజు తిరిగి న‌ర‌సాపురం వెళ్లిపోగా అక్క‌డ భీమ‌వ‌రం నియోజ‌క‌ర్గానికి చెందిన ఎంపీపీని ఇన్‌చార్జ్‌గా వేశారు. ఉండి ఇన్‌చార్జ్ పాత‌పాటి స‌ర్రాజు పూర్తిగా వీక్ అయిపోవ‌డంతో ఆయ‌న్ను కూడా త‌ప్పిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పాల‌కొల్లులో శేషుబాబును ప‌క్క‌న పెట్టి గుణ్ణం నాగ‌బాబుకు టిక్కెట్టు ఇచ్చే సూచ‌న‌లు ఉన్నాయి. ఉంగుటూరులో పుప్పాల వాసుకు బ‌దులుగా మాజీ మంత్రి వ‌సంత్ రంగంలో ఉంటాడ‌ని ప్ర‌చారం ఉంది. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ టిక్కెట్ల విష‌యంలో జ‌గ‌న్ చాలా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకునే సూచ‌న‌లు ఉన్నాయి