అక్కడ ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో టీడీపీ

సీనియ‌ర్ నేత భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ సీటు అధికార టీడీపీది కావ‌డంతో ఇక్క‌డ ఈ సీటును తిరిగి నిలుపుకునేందుకు టీడీపీ, ఇక్క‌డ నుంచి గెలిచిన భూమా వైసీపీ త‌ర‌పున గెల‌వ‌డంతో ఇక్క‌డ తిరిగి స‌త్తా చాటేందుకు వైసీపీ రెడీ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీ నుంచి ఇక్క‌డ అభ్య‌ర్థిగా ప‌లువురు పేర్లు విన‌ప‌డుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రి పేరు ఫైన‌లైజ్ కాలేదు.

ఈ ఉప పోరు కోసం విప‌క్ష వైసీపీ దూకుడు మీద ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు జ‌గ‌న్ వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ గంగుల ప్రతాపరెడ్డి పేరును దాదాపు ఖ‌రారు చేసేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో తాను వైసీపీ త‌ర‌పున పోటీ చేస్తున్న‌ట్టు గంగుల ప్ర‌క‌టించారు. దీంతో వైసీపీ అభ్య‌ర్థి ఖ‌రారైన‌ట్టే. రేపో మాపో ఆయ‌న ప్ర‌చార రంగంలోకి కూడా దిగ‌నున్నారు.

మ‌రో వైపు ఈ ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న టీడీపీ ఇంకా అభ్య‌ర్థి ఎంపిక‌లోనే తేల్చుకోలేక‌పోతోంది. అమెరికా పర్యటనను పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థిపై డిసైడ్ చేస్తానని ఇది వరకూ చంద్రబాబు ప్రకటించారు, అమెరికా నుంచి తిరిగి వచ్చి రోజులు గుడస్తున్నా బాబు నంద్యాల నేతలను మీటింగ్ కు పిలవలేదు.

ఇక్క‌డ అభ్య‌ర్థి ఎంపిక చంద్ర‌బాబుకు చాలా క్లిష్ట‌త‌రంగా ఉంది. ఓ వైపు భూమా వార‌సుల‌తో పాటు మ‌రోవైపు శిల్ప సోద‌రులు కూడా గ‌ట్టిగా ఫైట్ చేస్తున్నారు. వీరిలో ఎవ‌రికి టిక్కెట్టు ఇచ్చినా మ‌రొక‌రు ఎంత వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే ? శిల్ప అయితే త‌న‌కు టిక్కెట్టు రాక‌పోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తాన‌ని చెప్పారు. మ‌రోవైపు మాజీ మంత్రి ఫ‌రూఖ్ వ‌ర్గం సైతం శిల్ప‌కు టిక్కెట్టు ఇస్తే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రిస్తోంది. దీంతో ఇక్క‌డ అభ్య‌ర్థి ఎంపిక చంద్ర‌బాబుకు క‌త్తిమీద సాములా మారింది.