రాజ‌కీయాల‌కు దూరంగా నారాయ‌ణ‌.. రీజ‌న్ ఇదేనా

మూడేళ్ల నుంచి నెల్లూరు జిల్లాలో చ‌క్రం తిప్పిన మంత్రి నారాయ‌ణ‌కు ఎదురుగాలి మొద‌లైంది. జిల్లాలో స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోక‌పోయినా.. స్థానిక నాయ‌కుల‌తో ఏమాత్రం స‌ఖ్య‌త లేకపోయినా.. ఇవ‌న్నీ ఓపిగ్గా భ‌రించిన టీడీపీ అధినేత‌.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోయారు. ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను గుర్తించిన సీఎం.. వెంట‌నే నారాయ‌ణ‌కు.. సోమిరెడ్డికి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి వ్యూహాత్మ‌కంగా చెక్ చెప్పారు. త‌నకు వ్య‌తిరేకంగా ఉన్న వ‌ర్గాల‌న్నింటినీ సోమిరెడ్డి అక్కున చేర్చుకుంటుండటంతో కుమిలిపోతున్నార‌ట నారాయ‌ణ‌. ఈ విష‌యాన్ని యువ‌నేత లోకేష్‌కు చెప్పినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో.. జిల్లా రాజ‌కీయాల‌కు ఇక దూరంగా ఉండాల‌ని భావిస్తున్నార‌ట‌.

నెల్లూరు జిల్లాలో ఏకపక్షంగా, ఒంటెత్తు పోకడలతో, నియతృంత్వధోరణతో అధికారం చెలాయించిన మున్సిపల్‌మంత్రి నారాయణ దూకుడు పూర్తిగా తగ్గింది. నెల్లూరులో గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ పోటీకి తన దగ్గర బంధువుకు టిక్కెట్‌ ఇప్పించి గెలిపించుకోలేకపోయిన నారాయణపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో కేవలం మూడు వేల ఓట్ల మెజార్టీతో జగన్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించగా, సుమారు 20వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. అంతేగాక బ్యాలెట్‌ పేపర్‌పై నారాయణకు, ఆయ‌న‌ నిలబెట్టిన అభ్యర్థికి వ్యతిరేకంగా నినాదాలు రాసి సంచలనం సృష్టించారు. ఇదే స‌మ‌యంలో జిల్లా రాజ‌కీయాల్లో ఆయ‌న‌పై ఒక వ‌ర్గంపూర్తిగా అసంతృప్తితో ఉంది.

ఇవ‌న్నీ గ్ర‌హించిన సీఎం చంద్ర‌బాబు.. అదే జిల్లాకు చెందిన సోమిరెడ్డిని వ్యూహాత్మ‌కంగా తెర‌పైకి తెచ్చారు. జిల్లా రాజకీయాలను పట్టించుకోవద్దని మంత్రి నారాయణకు చంద్రబాబు హెచ్చరిక రూపంలో తెలియజేశారు. దీంతో ఖంగుతిన్న నారాయణ నిన్నటి వరకు ఏ యంత్రాంగాన్ని అయితే లెక్కచేయలేదో.. అదే యంత్రాంగానికి చెందిన వ్యక్తులను పిలిపించుకున్నప్పటికీ ఏ ఒక్కరూ ఆయనతో మాట్లాడేందుకు అంగీకరించటం లేద‌ట‌. అంతేగాక నిన్నటి వరకు నారాయణ చుట్టూ తిరిగిన అధికార, రాజకీయ యంత్రాంగం మొత్తం సోమిరెడ్డిని ఆశ్రయిస్తోంది. దీంతో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా సోమిరెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి.

సోమిరెడ్డి జిల్లాస్థాయి అధికారులను పిలిపించుకుని తాను అండగా ఉంటానని, అధైర్యపడవద్దని, సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న నారాయణ..  చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి ధైర్యం చాలక… యువ‌నేత లోకేష్ బాబుకు చెప్పి మొరపెట్టుకున్నారట. ఆయన కూడా `చూద్దాంలే` అని తేలిగ్గా తీసుకున్నారట. ఇక జిల్లాలో అడుగుపెట్టడం కన్నా…తన శాఖకే పరిమితం అయ్యేందుకే ‘నారాయణ’ నిశ్చయించుకున్నారట. మ‌రి ఓడ‌లు బ‌ళ్లు.. బ‌ళ్లు ఓడ‌లు అవ్వ‌డ‌మంటే ఇదేనేమో!!