`స్పీచ్‌`ల‌పై ప‌రిశీల‌కుల‌తో లోకేష్ స‌ర్వే

రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్..  బ‌హిరంగ స‌మావేశాల్లో త‌న ప్ర‌సంగాల‌పై పూర్తిగా దృష్టిపెట్టాడ‌ట‌. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఇటువంటి స‌మావేశాల్లో త‌డ‌బ‌డ‌టం.. ప్ర‌జ‌ల్లో ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా కామెంట్లు రావ‌డంతో వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతున్నాడ‌ట‌. త‌న గురించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల గురించి `ప‌రిశీల‌కుల‌`తో స‌ర్వే చేయించుకునే చంద్ర‌బాబు త‌ర‌హాలోనే.. లోకేష్ కూడా కొంత‌మంది `ప‌రిశీల‌కుల‌`ని నియ‌మించుకున్నార‌ట‌. ప్ర‌సంగాల అనంత‌రం ప్ర‌జ‌లు త‌న గురించి ఏమ‌నుకుం టున్నారో, త‌న స్పీచ్లు ఎంతవ‌ర‌కూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాయో తెలుసుకోవాల‌ని బాగా ఆరాట‌ప‌డుతున్నాడ‌ట‌.

నారాలోకేష్‌.. ఈపేరు ఎక్కువ‌గా అటు మీడియాలో.. ఇటు సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది. రాజ‌కీయాల్లో పూర్తిగా ప‌రిణతి సాధించ‌ని ఆయ‌న‌.. త‌న‌ ప్ర‌సంగాల‌తో బాగా పాపుల‌ర్ అయిపోయారు. టీడీపీ భావి నాయ‌కుడిగా అంద‌రూ భావిస్తున్న లోకేష్‌.. బహిరంగ వేదికలపై చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు పెద్ద దుమారం సృష్టించాయి. ఆయన చేసిన పొరపాట్లు వ్యక్తిగతంగానూ, పార్టీ ప‌రంగానూ చాలా వరకూ ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో లోకేష్ మాట్లాడిన మాటలు వీడియోలు ప్రదర్శించి.. విప‌రీతంగా కామెంట్లు చేయ‌డం జ‌రిగిపోయాయి. అంతేగాక సీఎం కూడా బ‌హిరంగ స‌మావేశాల్లో ఎలా మాట్లాడాలో సాధ‌న చేయాలని చెప్పార‌నే వార్త‌లు వినిపించాయి.

ఇప్పుడు లోకేష్ వాటిని దిద్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు కన్పిస్తోంది. అందులో భాగంగానే తన ప్రసంగాన్ని రాసే పెద్ది రామారావునే సమావేశాలకు తీసుకెళుతున్నార‌ట‌. మంత్రి నారా లోకేష్ ఇటీవల జోరుగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అక్కడ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయితే ఆ ఉపన్యాసాలు ఎలా ఉంటున్నాయి. ఇంకా ఆయన మార్చుకోవాల్సిన అంశాలు ఏమిటి? అనే అంశంపై ఆయనకు సలహాలు..సూచనలు ఇచ్చేందుకు `పరిశీలకులు` ప్రతి సమావేశానికి హాజరువుతున్నారు. ఆయా సమావేశాల్లో పాల్గొని వారు లోకేష్ స్పీచ్ ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత మెరుగుపర్చుకోవాల్సిన అంశాలపై సలహాలు ఇస్తారు.

కొంత కాలంగా టీడీపీలో లోకేష్ టీమ్ లో ఉన్న పెద్ది రామారావు. లోకేష్ ప్రసంగాలు అన్నీ ఆయనే తయారు చేస్తారని ప్రచారం ఉంది. పాపం వాళ్లు కూడా సాధార‌ణ ప్ర‌జల్లా క‌లిసిపోయి.. స్పీచ్‌లపై స్పంద‌న‌ను ర‌హ‌స్యంగా తెలుసుకుంటూ తిప్పులు ప‌డుతున్నార‌ట‌. మ‌రి స్క్రిప్ట్ ప్ర‌కారం ప్ర‌సంగాలు చేయాల‌నేది ఇప్ప‌టికైనా మానుకోవాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. వ‌క్త‌గా ఎద‌గాలంటే అన్ని అంశాల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉండాల‌ని చెబుతున్నారు. ఎవ‌రో రాసిచ్చిన విష‌యాన్ని చ‌దివితే కొన్ని సంద‌ర్భాల్లో బొక్క‌బోర్లా ప‌డ‌టం ఖాయం. మ‌రి వీలైనంత త్వ‌ర‌గా ఈ స్క్రిప్టు చ‌ద‌వ‌డం మాని.. సొంతంగా మాట్లాడే స్థాయికి త్వ‌ర‌గా ఎదిగితేనే గుర్తింపు ద‌క్కుతుంద‌న‌డంలో సందేహం లేదు!!