నంద్యాల అభ్య‌ర్థి ఎంపిక‌పై బాబు వ్యూహం ఇదే..

ప‌థ‌కాల గురించి స‌ర్వే.. ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వే.. పార్టీ ప‌రిస్థితిపై స‌ర్వే.. ఇలా ప్ర‌తి రెండు మూడు నెల‌ల‌కోసారి స‌ర్వేలు నిర్వ‌హించి వాటి ఆధారంగా భ‌విష్య‌త్ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఎప్ప‌టి నుంచో ఉన్న అల‌వాటు. క్లిష్ట‌ప‌రిస్థితుల్లో, ఎన్నిక‌ల స‌మయాల్లోనూ ఆయ‌న ఈ విధానాన్నే ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు క‌ర్నూలు జిల్లా నంద్యాల‌ ఉప ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న దీనినే ఫాలో అవుతున్నార‌ట‌. కొంత కాలం నుంచీ టీడీపీతో అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్న శిల్పావ‌ర్గానికి చెందిన కీల‌క నేత ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఆశ్చ‌ర్య‌కరం!

నంద్యాల‌ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మర‌ణంతో ప్రస్తుతం అక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది. ఈ టికెట్‌ను త‌మ వ‌ర్గానికి కేటాయించాలంటే.. త‌మ వ‌ర్గానికి కేటాయించాల‌ని అటు భూమా, ఇటు శిల్పా వ‌ర్గం గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టాయి. సెంటిమెంట్ ను బ‌ట్టి త‌మ‌కే ఇవ్వాల‌ని భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి అఖిల సీఎం చంద్ర‌బాబును కోరారు. దీంతో చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డిపోయారు. ఒక వ‌ర్గానికి కేటాయిస్తే మ‌రో వ‌ర్గం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తంచేస్తుండ‌టంతో ఇక చేసేది లేక `స‌ర్వే` మార్గానే ఎంచుకున్నార‌ట‌. ఈ విషయాన్ని వెల్లడించింది నంద్యాల రేసులో సీరియస్గా ప్రయత్నిస్తున్న శిల్పా బ్రదర్స్‌లో ఒకరైన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి.

ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పా చక్రపాణిరెడ్డి అమరావతిలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శిల్పా చక్రపాణిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీగా రెండోసారి అవకాశమిచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నిక గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో తాను మధ్యవర్తిని మాత్రమేనని చక్రపాణిరెడ్డి అన్నారు. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమన్నారు. నంద్యాలలో పోటీ పడేందుకు పెద్ద ఎత్తున పోటీ ఉన్న నేపథ్యంలో బరిలో దిగితే గెలిచే అభ్యర్థి ఎవరనే దానిపై సీఎం చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారన్నారు.

ఈ సర్వేలలో వచ్చే రిపోర్ట్ ఆధారంగా సీఎం చంద్రబాబు సముచిత నిర్ణయం తీసుకుంటారని శిల్పా వ్యాఖ్యానించారు. కాగా నంద్యాల సీటు ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని శిల్పా పునరుద్ఘాటించారు. ఇక్క‌డ గెలిచితీరాల‌ని వైసీపీ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో.. నంధ్యాల అభ్య‌ర్థి ఎంపిక క‌త్తిమీద సాములా మారింది. మ‌రి చంద్ర‌బాబు మార్క్ స‌ర్వే వ్యూహం ఇక్క‌డ ఫ‌లిస్తుందో లేదో!!