టీటీడీ ఈవో నియామ‌కంపై ర‌చ్చ త‌గునా?

`టీటీడీ ఈవోగా ఉత్త‌రాదివారిని ఎందుకు నియ‌మించారు? అందుకు త‌గిన స‌మ‌ర్థులు ఏపీలో లేరా?` అంటూ ట్విట‌ర్‌లో ఘాటుగా స్పందించారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌!! `తెలుగు రాని వ్య‌క్తిని ఆ ప‌ద‌వికి ఎందుకు క‌ట్ట‌బెట్టారు` అంటూ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానంద స్వామి ప్ర‌శ్న‌!! ఒక వ్య‌క్తి నియామ‌కంపై ఇప్పుడు ఏపీలో స‌రికొత్త చ‌ర్చ మొద లైంది. రాజ‌కీయ నాయ‌కుడు ఒక‌రు.. ఆధ్యాత్మ‌క వేత్త మ‌రొక‌రు ఎందుకు ఈ విష‌యాన్ని ఇంత‌లా ఫోక‌స్ చేస్తున్నారు? దీని వ‌ల్ల వారికి వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు ఒన‌గూరేదేంట‌నేది ఇప్పుడు అంద‌రిలోనూ మెదులుతున్న ప్ర‌శ్న‌!!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్య‌నిర్వ‌హ‌ణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియ‌మించిన‌ప్ప‌టి నుంచి ఏపీ రాజ‌కీయాల్లో సెగ రాజుకుంది. సుదీర్ఝ రాజ‌కీయానుభ‌వం క‌లిగిన అధికారి.. ద‌శాబ్దం పైనే తెలుగు రాష్ట్రంలో ప‌నిచేసిన వ్య‌క్తి ఆయ‌న‌. ఉత్త‌రాదివారికి టీటీడీ ఈవో ప‌ద‌వి ఎందుకిస్తార‌ని ట్వీట్ చేస్తారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. మ‌రోవైపు తాను త‌ప్పుప‌ట్ట‌డం లేదంటారు. ద‌క్షిణాదికి జ‌రుగుతున్న అన్యాయంపై వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా ట్విట‌ర్‌లో స్పందిస్తుంటారు ప‌వ‌న్!  దీని వ‌ల్ల యువ‌త‌రం ఆలోచ‌న‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి ఉండ‌దు. ఉత్త‌రాది .. ద‌క్షిణాది అంటూ విద్వేష‌భావాల‌ను రెచ్చ‌గొట్ట‌డం త‌గ‌ద‌నేది కొంద‌రి వాద‌న‌.

అనిల్ కుమార్‌ను ఎంపిక‌చేశారంటూ ప్ర‌శ్నించారు. తెలుగు రాని వారికి ఆ ప‌ద‌విని ఎలా క‌ట్ట‌బెడ‌తార‌నీ అడిగారు విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి. అప్పుడ‌ప్పుడూ రాజ‌కీయాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తుంటారు ఆయ‌న‌. స్వ‌రూపానంద ప‌రిపాల‌నప‌ర‌మైన అంశాల‌లో త‌ల‌దూరిస్తే ఆయ‌న‌కూ రాజ‌కీయ క‌శ్మ‌లం అంట‌క త‌ప్ప‌దు. త‌న‌కు తెలుగురాద‌ని విమ‌ర్శించిన వారికి తెలుగులో మాట్లాడి వాళ్ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు సింఘాల్. ఇక్క‌డ మ‌రో విష‌య‌మేటంటంటే.. ఆంధ్ర వారిని బద్ధ శ‌త్రువులుగా భావించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం తాను చేసే హోమాల‌కు ఆంధ్ర బ్రాహ్మ‌ణ పండితుల‌కే పెద్ద పీట వేస్తున్నార‌ని గుర్తుంచుకోవాలి.

రేపో మాపో టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వికీ ఎవ‌రినో ఒక‌రిని నియ‌మించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్ పేరు వినిపిస్తోంది. ఆయ‌న చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులు. ఈయ‌న విష‌యంలో కూడా వివాదం రేప‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి అంశాల‌పై త‌గ‌వులు పెట్టాల‌నీ, విమ‌ర్శ‌లు కుప్పించాల‌నీ చూడ‌డం స‌మంజ‌సం కాద‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.