ఆ ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిపోతున్న చంద్ర‌బాబు

ఒకే ఒక్క కుర్చీ కోసం ఇప్పుడు టీడీపీలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రి మ‌ధ్య తీవ్రంగా పోటీ నెల‌కొంది. ఒకే ఒక్క చాన్స్ అంటూ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఇప్ప‌టికే ఎన్నోసార్లు ఆయ‌న్ను కోరారు. చివ‌రికి ఎంపీ పోస్టుకు రాజీనామా కూడా చేస్తాన‌ని ప్ర‌క‌టించి.. సీఎంపై ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ చంద్ర‌బాబు దృష్టిలో మాత్రం.. మ‌రో ఎంపీ ముర‌ళీమోహ‌న్ ఉంద‌ని తెలియ‌డంతో ఇప్పుడు పార్టీలో అంత‌ర్గ‌తంగా తీవ్ర చ‌ర్చ మొద‌లైంది. మ‌రి ఇద్ద‌రు సన్నిహితుల్లో టీటీడీ చైర్మ‌న్‌గా ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే విష‌యంపై చంద్ర‌బాబు తీవ్రంగా మ‌థ‌న‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం!

తెలుగుదేశం పార్టీలో మ‌రో హాట్ టాపిక్ మొద‌లైంది. టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి త‌మ‌కే ఇవ్వాలంటూ ప‌లువురు ప్ర‌ముఖ నేతలు సీఎం చంద్ర‌బాబుపై ఒత్తిడి పెంచుతున్న‌ట్టు స‌మాచారం. ఈ కుర్చీ కోసం కుస్తీలు ప‌డుతున్న‌వారిలో ప్ర‌ముఖంగా వినిస్తున్న పేర్లు… ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, ముర‌ళీమోహ‌న్‌. ఇవాళ్లో రేపో దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇంత‌కీ చంద్ర‌బాబు మ‌న‌సులో ఎవ‌రున్నారంటే… ఎంపీ ముర‌ళీ మోహ‌న్ అని అంటున్నారు! ఎందుకంటే, ముర‌ళీ మోహ‌న్ తో చంద్ర‌బాబుకు ఉన్న ‘ప్ర‌త్యేక’ అనుబంధం తెలిసిందే న‌ని చెబుతున్నారు.

ఆ ప్రాతిప‌దికన ముర‌ళీమోహ‌న్ పేరును ఖ‌రారు చెయ్యొచ్చు అంటూ టీడీపీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, వీటిని రాయ‌పాటి వ‌ర్గం కాస్త సీరియ‌స్ గానే తీసుకుంటోంద‌ట‌! ముఖ్య‌మంత్రికి ఎన్నో సంద‌ర్భాల్లో ఎంత‌గానో సాయం చేస్తూ చేదోడు వాదోడుగా నిలిచిన‌ రాయ‌పాటిని కాదని, వేరే నాయ‌కుడికి ఎలా అవ‌కాశం ఇస్తార‌నే వాద‌న వినిపిస్తున్నారు. రాయ‌పాటి అన్ని వ‌ర్గాల వారికీ అందుబాటులో ఉంటార‌నీ, ముర‌ళీ మోహ‌న్ అయితే ఒక్క సినీ ప్ర‌ముఖుల‌కు త‌ప్ప.. ఆయ‌న మిగతావారితో క‌లుపుగోలుగా ఉన్న సంద‌ర్భాలు చాలా త‌క్కువ ఉన్నాయంటూ రాయ‌పాటి వ‌ర్గీలు అంటున్నార‌ట‌!

ఛైర్మ‌న్ ప‌ద‌వి త‌న‌కు ద‌క్క‌క‌పోతే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి, పార్టీకి దూరంగా ఉంటాన‌ని స‌న్నిహితుల వ‌ద్ద ఆఫ్ ద రికార్డ్ గా రాయ‌పాటి మాట్లాడిన‌ట్టు కూడా ఓ ప్రచారం జ‌రుగుతోంది. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల్ని ద‌క్కించుకున్న‌ది రాయ‌పాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీయే. కానీ, ఆ పనుల్ని ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నది సీఎం చంద్ర‌బాబు నాయుడు. చంద్ర‌బాబు ప‌ట్ల అంత కృత‌జ్ఞ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న రాయ‌పాటికే ఈ ప‌ద‌వి ద‌క్కాలంటూ ఆ వ‌ర్గం బ‌లమైన వాద‌న వినిపిస్తోంది. మరి వీరిలో ఎవ‌రిపై చంద్ర‌బాబు.. క‌టాక్షం ఉంటుందో చూడాల్సిందే!!