ఆప్ ఇంటిపోరులో స‌మిధ‌లెవ‌రు?

ఇంత‌లోనే ఎంత వ్య‌త్యాసం! ఢిల్లీ రాజ‌కీయాల‌ను `చీపురు`తో తుడిచేయాల‌ని ఉన్న‌త ఉద్యోగాన్ని వ‌దిలి వ‌చ్చిన `సామాన్యుడి`ని ప్ర‌జ‌లు అంద‌ల‌మెక్కించారు. రాజ‌కీయాల్లో మార్పు త‌థ్య‌మ‌ని భావించి అనూహ్య విజ‌యాన్ని అందించారు. ఏళ్లు గ‌డుస్తున్న కొద్దీ.. ఆ సామాన్యుడిపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. లంచం తీసుకున్నాడంటూ.. ఏకంగా ఏసీబీకి కూడా ఫిర్యాదుచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏకంగా సామాన్యుడి సైన్యంలోని కొంత‌మంది తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో ఆ సామాన్యుడు, ఆమ్ ఆద్మీ అధినేత‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స‌త‌మ‌త‌మవుతున్నారు.

ఆమ్ ఆద్మీలో కుమ్ములాటలు ఎన్న‌డూ లేనంత తార‌స్థాయికి చేరాయి. అవినీతి ఆరోప‌ణ‌లు, అరెస్టుల‌తో ఇప్ప‌టికే ఆ పార్టీ నాయ‌కులంతా వివిధ కేసుల్లో అరెస్టయ్యారు. ఇప్పుడు ఏకంగా అధినేత కేజ్రీవాల్‌పైనే తీవ్రంగా ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. ఇత‌ర రాష్ట్రాల్లోనూ విస్త‌రించే ప్ర‌య‌త్నాల్లో భాగంగా.. పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆప్ పోటీచేసింది. ఇప్పుడు ఆ ఎన్నిక‌ల్లో కేజ్రీవాల్ భారీగా అవినీతికి పాల్ప‌డ్డార‌ని, లంచం తీసుకున్నార‌ని మాజీమంత్రి క‌పిల్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఢిల్లీ రాజ‌కీయాల్లో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా హీటెక్కింది. కేజ్రీవాల్.. రాజకీయంగా ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

మిస్టర్ క్లీన్ గా చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు.. జీవితంలో మరిచిపోలేని మరక అంటింది. తాను చూస్తుండగానే.. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రెండున్నర కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారంటూ.. మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. అంతేగాక ఈ విష‌యంపై యాంటీ కరప్షన్ బ్యూరోకు ఫిర్యాదు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అవసరమైతే.. తనతో పాటు.. సత్యేంద్ర జైన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూ లై డిటెక్టర్ పరీక్షలు కూడా చేయించాలన్నారు. అలా చేస్తే.. నిజమేంటో తేలిపోతుందని కూడా చెప్పారు.

దీంతో.. కేజ్రీవాల్ మరింత ఇరకాటంలో పడ్డారు. అక్కడితో ఆగని కపిల్ మిశ్రా.. సీబీఐ తలుపు కూడా తట్టేశారు. ఏకంగా ముఖ్యమంత్రిపైనే అవినీతి ఆరోపణలు రావడంతో.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రంగంలోకి దిగారు. ఆరోపణలపై దర్యాప్తు చేయాలని యాంటీ కరప్షన్ బ్యూరోను ఆదేశించారు. మరోవైపు కపిల్ ఆరోపణలపై స్పందించాలని మంత్రి మనీష్ సిసోడియాను అడగ్గా.. ఆయన చాలా ఆగ్రహంగా స్పందించారు. ఈ విషయంపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నట్టుగా.. వెళ్లిపోయారు. ఒక్క‌సారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యేంతగా ఆరోప‌ణ‌లు కేజ్రీవాల్‌ను చుట్టుముట్టేశాయి.