లోకేశ్ అడిగారు….బాబు ఇచ్చారు

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేశ్‌కు జ‌రిగినంత సులువుగా ఏ వార‌సుడి పొలిటిక‌ల్ ఎంట్రీ జ‌ర‌గ‌దేమో..? చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ఎమ్మెల్సీగా ఎంట్రీ ఇచ్చిన లోకేశ్ మూడు రోజుల‌కే ఏకంగా కేబినెట్ మంత్రి అయిపోయాడు. వ‌డ్డించే వాడు మ‌న‌వాడైతే వ‌రుస‌లో ఎక్క‌డ కూర్చున్నా ఒక్క‌టే అన్న సూత్రం లోకేశ్‌కు నూటికి నూరుశాతం వ‌ర్తిస్తుంది. కేవ‌లం చంద్ర‌బాబు కుమారుడు అన్న ఒక్క అండ‌తోనే లోకేశ్ ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేకుండా మంత్రి అయిపోయాడు.

ఇక కేబినెట్‌లోకి వ‌చ్చిన వెంట‌నే చంద్ర‌బాబు కూడా లోకేశ్‌కు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ‌లు కేటాయించారు. ఇదిలా ఉంటే త‌న‌కు వ‌చ్చిన శాఖ‌ల గుట్టును లోకేశే స్వ‌యంగా ర‌ట్టు చేసుకున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో లోకేశ్ బ‌హిరంగ వేదిక మీదే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. త‌న‌ను చంద్ర‌బాబు గారు మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటాన‌ని చెప్ప‌గానే తాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కావాలని మరీ అడిగి తీసుకున్నానని తెలిపారు.

లోకేశ్ చెప్పిన దానిని బ‌ట్టి ఆయ‌న అడిగిన శాఖ‌ల‌నే చంద్ర‌బాబు ఇచ్చిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. వాస్త‌వంగా చూస్తే లోకేశ్ కాకుండా వేరే ఎవ‌రైనా ఐటీ రంగాన్ని స్టేట్‌లో ప‌రుగులు పెట్టిస్తాన‌ని అంటే వారికి ఆ శాఖ‌లు చంద్ర‌బాబు ఎంత వ‌ర‌కు ఇస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. అయితే త‌న కుమారుడికి మాత్రం ఇచ్చేశారు. వాస్త‌వంగా మంత్రివ‌ర్గంలో ఎవ‌రికి ఏ శాఖ‌లు కేటాయించాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి ఇష్టం. వారి స‌మ‌ర్థ‌త‌ను ఆధారంగా చేసుకుని వారికి ఆ శాఖ‌లు ఇస్తారు. కానీ చంద్ర‌బాబు లోకేశ్ అడిగిన వెంట‌నే కొడుకు క‌దా ? అని కోరుకున్న శాఖ‌లు ఇవ్వ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

దేశంలో చాలా మంది రాజ‌కీయ వార‌సులు వ‌స్తున్నారు. స‌క్సెస్ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే లోకేశ్‌ను సైతం మంత్రిని చేయ‌డాన్ని ఎవ్వ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. అయితే అందుకు కనీసం కొంత కసరత్తు అవసరం. ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి స‌రిగా మాట్లాడ‌లేక‌పోతోన్న లోకేశ్ మ‌రోసారి త‌న ప్ర‌స‌గంలో దారుణంగా త‌డ‌బ‌డ్డాడు.

పంచాయతీరాజ్ శాఖ ద్వారా వచ్చే రెండేళ్ళలో గ్రామాల్లో మంచినీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పాల్సింది పోయి..నీరు లేకుండా చేస్తానని అనబోయి..తప్పును గ్రహించి మింగేశారు. అయినా నారా లోకేష్ ప్రసంగం చూసిన వారంతా నవ్వుకున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో లోకేశ్ ప్ర‌సంగం అంటేనే పెద్ద కామెడీ అయిపోయింది.