చిన‌బాబు చేతుల్లో మంత్రుల‌కు అవ‌మానాలు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్ అప్పుడే త‌న తోటి మంత్రుల‌కు విశ్వ‌రూపం చూపించేస్తున్నాడు. ఎమ్మెల్సీ అయిన మూడు రోజుల‌కే మంత్రి అయిన లోకేశ్‌కు చంద్ర‌బాబు కీల‌క‌మైన పంచాయ‌తీ రాజ్‌, ఐటీ శాఖ‌లు కేటాయించాడు. ఇక తాను గ‌తంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న‌ప్పుడే సీనియ‌ర్ మంత్రులు అయిన కెఈ.కృష్ణ‌మూర్తి, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప వంటి శాఖ‌ల్లో పూర్తి పెత్త‌నం చేసిన లోకేశ్ ఇప్పుడు మంత్రి అయిన వెంట‌నే ఇత‌ర మంత్రుల విష‌యాల్లో మ‌రింత‌గా జోక్యం చేసుకుంటున్నాడ‌న్న చ‌ర్చ‌లు ఏపీ స‌చివాల‌య‌వ‌ర్గాల్లో విన‌వ‌స్తున్నాయి.

ఇటీవ‌లే లోకేశ్‌తో పాటు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్‌.జ‌వ‌హ‌ర్ తొలిసారిగా కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్నారు. చంద్ర‌బాబు ఆయ‌నకు కీల‌క‌మైన ఎక్సైజ్ శాఖ కేటాయించారు. జ‌వ‌హ‌ర్ ఇటీవ‌ల లోకేశ్‌ను క‌లిసేందుకు వెళ్లార‌ట‌. లోకేశ్ జ‌వ‌హ‌ర్‌ను ఏకంగా గంట‌కు పైగా వెయిట్ చేయించార‌ట‌. ఆయ‌న‌కు కనీసం లోకేశ్ ఛాంబ‌ర్‌లో అయినా కూర్చోవాల‌న్న ఆదేశాలు లేక‌పోవ‌డంతో జ‌వ‌హ‌ర్ సాధార‌ణ జ‌నాలు కూర్చునే చోటే ఏకంగా గంట‌కు పైగా వెయిట్ చేశారు. ఇది చూసిన మీడియా వ‌ర్గాల్లో ఒక్క‌టే చ‌ర్చ స్టార్ట్ అయ్యింది.

సీనియ‌ర్ మంత్రులు స‌మావేశాల్లో ఉంటేనే వారిని మీట్ అవ్వ‌డానికి స‌హ‌చ‌ర మంత్రులు వ‌స్తుంటారు. అలాంటి వాళ్ల‌నే వారు త‌మ ఛాంబ‌ర్‌లో కూర్చోపెట్టి ఈ మీటింగ్ అయ్యాక క‌లుస్తారు. అలాంటిది జూనియ‌ర్ అయిన లోకేశ్ ఇలా చేయ‌డంతో అధికార పార్టీ వ‌ర్గాల‌తో పాటు స‌చివాల‌య‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. మంత్రి అయిన ప‌ది రోజుల‌కే లోకేశ్ ఇలా చేస్తున్నాడంటే ఫ్యూచ‌ర్‌లో సీనియ‌ర్ మంత్రుల ప‌రిస్థితి ఎలా ఉంటుందా ? అని కొంద‌రు సందేహాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక ఈ సంగ‌తి ఇలా ఉంటే కీల‌క‌మైన సీఆర్‌డీఏ, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల లే అవుట్ల‌లో మార్పుల‌పై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం ఆధ్వ‌ర్యంలో స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. వీటిల్లో స‌భ్యుడు కాక‌పోయినా కూడా లోకేశ్ పాల్గొన‌డంతో సీనియ‌ర్ మంత్రులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక గ‌తంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు లోకేశ్‌ను క‌ల‌వాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోవాల‌ని రూల్స్ పెట్ట‌డం పెద్ద దుమార‌మే రేపింది. ఇక ఇప్పుడు ఇత‌ర మంత్రుల శాఖ‌ల్లో వేలు పెట్ట‌డం, మంత్రులు త‌న‌ను మీట్ అయ్యేందుకు వ‌స్తే కూడా గంట సేపు వెయిట్ చేయిస్తుండ‌డంతో పార్టీ సీనియ‌ర్ల‌తో పాటు మంత్రుల్లో కూడా అసంతృప్తి నెల‌కొంది. అయితే వారెవ్వ‌రు ఈ విష‌యాన్ని సాహ‌సించి బ‌య‌ట‌కు చెప్ప‌డ‌మో లేదా ? చంద్ర‌బాబు వ‌ద్ద‌కు తీసుకు వెళ్ల‌డ‌మో చేయ‌లేర‌నుకోండి…!