ధూలిపాళ్ల న‌రేంద్ర కొత్త నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్ను..!

టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియ‌ర్ ఎమ్మెల్యే ధూలిపాళ్ల న‌రేంద్ర‌కు పార్టీలో వ‌రుస‌గా క‌ష్టాలు, అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి 1994 నుంచి 2014 వ‌ర‌కు వ‌రుస‌గా ఓట‌మి లేకుండా ఐదుసార్లు గెలిచిన న‌రేంద్ర‌కు చిర‌కాల కోరిక అయిన మంత్రి ప‌ద‌వి మాత్రం రాలేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా చంద్ర‌బాబు న‌రేంద్ర‌ను క‌రుణించ‌లేదు.

మొన్న కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో న‌రేంద్ర‌కు గ్యారెంటీ బెర్త్ ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే మ‌రోసారి న‌రేంద్ర‌కు మొండిచేయి త‌ప్ప‌లేదు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌రేంద్ర పొన్నూరు కాకుండా ప్ర‌త్తిపాడు నుంచి పోటీ చేస్తార‌న్న ఊహాగానాలు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న ప్ర‌త్తిపాడు జ‌న‌ర‌ల్‌గా మారుతుంద‌ని, జ‌న‌ర‌ల్‌గా ఉన్న పొన్నూరు ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అవుతుంద‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌టైంలోనే పొన్నూరు ఎస్సీ అవుతుంద‌ని అనుకున్నా చివ‌రి నిమిషంలో ప‌క్క‌నే ఉన్న ప్ర‌త్తిపాడు ఎస్సీల‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో పొన్నూరు జ‌న‌ర‌ల్‌గానే ఉంది. ఇక ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే పొన్నూరు ఎస్సీ కావ‌డం ఖాయ‌మ‌న్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే న‌రేంద్ర పక్క‌నే ఉన్న ప్ర‌త్తిపాడు నుంచి బ‌రిలో ఉంటార‌ని …ఇందుకోసం ఇప్ప‌టి నుంచి ప్ర‌త్తిపాడుపై ప‌ట్టుకోసం ట్రై చేస్తున్నార‌ని తెలుస్తోంది.